Pranab Mukherjee: వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ.. కాంగ్రెస్-బీజేపీయేతర అభ్యర్థిగా బరిలోకి?

  • వేడెక్కుతున్న ఢిల్లీ రాజకీయాలు
  • తెరవెనుక జోరుగా చర్చలు
  • మూడో ఫ్రంట్ ప్రధాని అభ్యర్థిగా ‘దాదా’

రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని, అసాధ్యం అంటూ ఏమీ ఉండదనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. తాజాగా మరో ఆశ్చర్యకరమైన, ఎవరూ ఊహించని వార్త ఒకటి ఢిల్లీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీల ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారన్నదే ఆ వార్త.

గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఈ విషయాన్ని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా, రాజకీయ ఉద్ధండుడిగా పేరు గాంచిన ప్రణబ్ ఆరెస్సెస్ సమావేశానికి హాజరుకానున్నారన్న వార్త తాజాగా ప్రకంపనలే రేపింది. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగత్ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించినప్పుడే ఏదో జరగబోతోందని విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు.  

ఆరెస్సెస్ సమావేశానికి హాజరు కావడం ద్వారా తానింకా రాజకీయాల్లోనే ఉన్నానని సందేశం ఇవ్వడమే ప్రణబ్ ఉద్దేశమని చెబుతున్నారు. గత జనవరిలో బిజూ పట్నాయక్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్  పట్నాయక్ భువనేశ్వర్‌లో ఇచ్చిన విందుకు ప్రణబ్ హాజరయ్యారు. దేవెగౌడ, సీతారాం ఏచూరి, ఎల్‌కే అద్వానీ తదితరులు కూడా దీనికి విచ్చేశారు. అయితే, ఈ విందు గురించి మీడియాలో ఎక్కడా హడావుడి కనిపించలేదు. పేరుకు ఇది బిజూ పట్నాయక్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ సమావేశమే అయినా, నిజానికి ఇక్కడ కీలక చర్చలు జరిగినట్టు బయటపడింది. మూడో ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి నేతలందరూ చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశానికి కొన్ని నెలల ముందు ప్రణబ్ రాష్ట్రపతి పదవిలో ఉండగానే నవీన్ పట్నాయక్‌కు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. అక్కడి నుంచే వారు మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. బెంగాల్‌కే చెందిన ప్రణబ్‌కు, మమతకు తొలి నుంచి  సత్సంబంధాలు ఉన్నాయి.

గతంలో ప్రణబ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ .. యూపీఏ-2 హయాంలో సోనియా తనను ప్రధానిని చేస్తారని భావించినట్టు చెప్పడం ద్వారా ప్రధాని కావాలన్న కాంక్ష తనలో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. ఇక ఆయనను 'ప్రధాని కాని ప్రధాని' అని చాలామంది సంబోధిస్తుంటారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆయన మూడో ఫ్రంట్ నుంచి ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలను కొట్టి పడేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే, ఒకటి.. గతంలో భారత రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవ్వరూ ఆ తర్వాత ఇక క్రియాశీల రాజకీయాల్లో ఉండలేదు. ఏ పదవినీ తీసుకోలేదు. హుందాగానే వుండిపోయారు. మరి ఆ సంప్రదాయాన్ని కాదని ప్రణబ్ ముందుకొస్తారా? అన్నది కూడా ప్రశ్నే!  

Pranab Mukherjee
Prime Minister
Congress
BJP
  • Loading...

More Telugu News