Pawan Kalyan: టీడీపీ వాళ్లకి ఇసుక అంటే ఎంత ఇష్టమో.. కనిపిస్తే చాలు, కరకరా నమిలేస్తున్నారు!: పవన్ కల్యాణ్ సెటైర్
- బీజేపీని అంబారీలు ఎక్కించింది తెలుగు దేశం వాళ్లే
- శ్రీకాకుళం జిల్లాలో భూ కబ్జాలు, ఇసుక దోపిడీలు
- ఇసుక దోపిడీకి నదులు బావురుమంటున్నాయి
- ప్రజలకి రక్షిత మంచి నీళ్లు కూడా దక్కనీయట్లేదు
లక్ష కోట్ల రూపాయలతో అమరావతి అభివృద్ధి అంటారు గానీ ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం 200 కోట్ల రూపాయలయినా చంద్రబాబు ఇవ్వలేకపోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. పుష్కరాలకు 2 వేల కోట్లు ఇచ్చే ప్రభుత్వం శ్రీకాకుళం రైతులకి ఉపయోగపడే ఇరిగేషన్ ప్రాజెక్టులకి మాత్రం నిధులు ఇవ్వడం లేదని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో శ్రీకాకుళం జిల్లా అంటే చిన్న చూపు అని ఆరోపించారు. కాలుష్య కారక పరిశ్రమల్ని శ్రీకాకుళం తరలించి, ఇక్కడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో ప్రభుత్వాల తీరుపై నిరసన కవాతు నిర్వహించి... అక్కడి ఏడు రోడ్ల జంక్షన్ లో పవన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఆ వేదిక నుంచి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... "మన యాస, భాషను గౌరవించే ప్రభుత్వం కావాలి. ఈ పాలకులకి మన శ్రీకాకుళం అంటే చిన్న చూపు. ఇక్కడి ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ఉత్తరాంధ్ర నాయకులం అని చెప్పుకొనే అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి రాజు, బొత్స సత్యనారాయణలు ఉద్ధానం సమస్యని ఇన్నేళ్లుగా ఎందుకు పట్టించుకోలేదు? రెండు దశాబ్దాల్లో 40 వేల మంది చనిపోయినా వీరిలో కదలిక రాదా? మరోవైపు భూగర్భ జలాల్ని కలుషితం చేసే పరిశ్రమల్ని ఇక్కడ పెట్టిస్తున్నారు.
అంటే ప్రజలకి రక్షిత మంచి నీళ్లు కూడా దక్కనీయరా? అచ్చెన్నాయుడు డబ్బున్న వ్యక్తి కాబట్టి మినరల్ వాటర్ తాగుతారు. మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? గుజరాత్ వాళ్లు వద్దంటే అణు విద్యుత్ కేంద్రాన్ని ఈ జిల్లాలోని కొవ్వాడలో పెట్టిస్తున్నారు. పచ్చని భూములు లాక్కొంటున్నారు. ఇలాంటి విద్యుత్ కేంద్రం వల్ల ఉపద్రవం వస్తే ఏమీ మిగలదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా కవాతులు చేస్తున్నాం.
ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి గత మూడేళ్ళలో 36 సార్లు మాట మార్చారు. బీజేపీ వాళ్లు హోదా అనేది గడచిన అధ్యాయం అంటారు. అటువంటి వారిని అంబారీలు ఎక్కించి, అమరావతిలో సన్మానాలు చేసింది తెలుగు దేశం వాళ్లే. అలా సన్మానాలు చేసి కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. రాష్ట్రానికి మాత్రం హోదా సాధించలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఏ మూలకి వెళ్లినా అధికార పార్టీ వాళ్ల భూ కబ్జాలు, ఇసుక దోపిడీ గురించే మాట్లాడుతున్నారు.
టీడీపీ వాళ్లకి ఇసుక అంటే ఎంత ఇష్టమో! కనిపిస్తే చాలు కరకరా నమిలేస్తున్నారు. ఇసుక దోపిడీకి నదులు బావురుమంటున్నాయి. ముఖ్యమంత్రి అంటున్నారు... జనసేనకు ఒక శాతం ఓట్లే వస్తాయి అని. అలాంటి ఆయన గత ఎన్నికల ముందు హైదరాబాద్ లోని మన పార్టీ ఆఫీస్ కి వచ్చి మరీ మద్దతు అడిగారు. ఆయనది ఏరు దాటాకా తెప్ప తగలేసే రకం. మీ మాటలు, కథలు వినేందుకు ఇక్కడ ఎవరూ పాత తరంవాళ్లు లేరు. ఇక్కడ ఉన్నది కత్తులు దూసే యువత అని గుర్తుపెట్టుకోండి" అంటూ చంద్రబాబును పవన్ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.