Hyderabad: హోంగార్డు కిరాతకం... ప్రేమించలేదని పాశవికంగా హత్య!

- హైదరాబాద్ లో కలకలం రేపిన ఉన్మాది ఘాతుకం
- షాప్ లో పనిచేస్తున్న యువతి గొంతుకోసిన హోంగార్డు
- ఆపై పోలీసుల ఎదుట లొంగుబాటు
తన ప్రేమను నిరాకరించిందన్న ఆగ్రహంతో ఉన్మాదిగా మారిన ఓ హోంగార్డు, పొలమూరి వెంకటలక్షి (19) అనే యువతిని దారుణంగా హతమార్చాడు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పరిధిలో కలకలం సృష్టించిన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు వెంకటలక్ష్మి, తన తల్లిదండ్రులతో కలసి నగరంలో నివసిస్తూ స్థానికంగా ఉన్న చిన్న ఇమిటేషన్ జ్యూయెలరీ షాప్ లో పనిచేస్తోంది. గత కొంత కాలంగా, ఓ జిల్లా ఎస్పీ వద్ద డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న సాగర్ అనే హోంగార్డు, ఆమెను ప్రేమించాలని వేధిస్తున్నాడు.
ఈ క్రమంలో నిన్న షాప్ లో వెంకటలక్ష్మి ఒంటరిగా ఉన్న వేళ, అక్కడికి వచ్చిన సాగర్, తనను వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తేవడంతో పాటు, ఆమె గొంతుకోసి దారుణంగా హతమార్చాడు.
