Donald Trump: ట్రంప్ రాసిన లేఖలో పదకొండు తప్పులా!
- ట్రంప్ కు లేఖ రాసిన పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయురాలు
- ఉన్మాది కాల్పుల్లో బాధిత కుటుంబాలను ఆదుకోమని కోరిన వైనం
- తప్పుల తడకగా ట్రంప్ సమాధాన లేఖ
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆంగ్ల భాషలో నైపుణ్యం అంతగా లేదని ఇటీవలే పదవీ విరమణ చేసిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఓనే మాసన్ విమర్శిస్తున్నారు. ట్రంప్ ను ఆమె ఎందుకు విమర్శించారో తెలియాలంటే.. ముందుగా ఇటీవల జరిగిన ఓ సంఘటన గురించి మనం తెలుసుకోవాలి. ఫ్లోరిడా రాష్ట్రంలోని పార్క్ లాండ్ లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో పద్నాలుగు మంది విద్యార్థులు మృతి చెందారు.
ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను ట్రంప్ స్వయంగా కలిసి పరామర్శించాలని కోరుతూ ఓనే మాసన్ ఓ లేఖ రాశారు. ఇందుకు స్పందించిన ట్రంప్ తిరిగి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ట్రంప్ రాసిన ఇంగ్లీషు తప్పుల తడకగా ఉందని ఓనే మాసన్ విమర్శిస్తున్నారు. ట్రంప్ రాసిన తప్పుల గురించి ఆమె ప్రస్తావిస్తూ.. ‘ప్రెసిడెంట్’, ‘స్టేట్’ వంటి పదాలను పెద్ద అక్షరాల (క్యాపిటల్ లెటర్స్)లో రాయడంలో తప్పులతో సహా మొత్తం 11 తప్పులను ఆమె గుర్తించారు. ఆ లేఖను సరిచేసి తిరిగి వైట్ హౌస్ కు పంపారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన అభ్యర్థనపై స్పందిస్తూ ట్రంప్ రాసిన లేఖలో స్పష్టత లేకపోగా, ఆ లేఖలో వ్యాకరణ దోషాలు ఉన్నాయని అన్నారు. ఈ చిన్న లేఖలో పదకొండు తప్పులా? అంటూ ఓనే మాసన్, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ లేఖను ఏ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థో కనుక రాసి ఉంటే.. ఆ విద్యార్థికి ‘సీ’ లేదా ‘సీ ప్లస్’ గ్రేడ్ ఇచ్చే దానినని, అదే కనుక, ఉన్నత పాఠశాల విద్యార్థి అయితే ‘డీ’ గ్రేడ్ ఇచ్చే దానినని సెటైర్లు వేశారు.
బహుశా ఈ లేఖను ట్రంప్ కు బదులు వైట్ హౌస్ సిబ్బంది ఎవరైనా రాశారేమోననే అనుమానం ఆమె వ్యక్తం చేయడం గమనార్హం. కాగా, ఓనే మాసన్ గురించి చెప్పాలంటే.. దక్షిణ కరోలినాలో పదిహేడు సంవత్సరాలపాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆంగ్లం బోధించారు. ప్రస్తుతం అట్లాంటాలో ఆమె నివాసముంటున్నారు.