Vijayawada: 1982... నేను సినిమాటోగ్రఫీ మంత్రిని... ఎన్టీఆర్ ను కలిసేందుకు వెళ్లిన వేళ...: మహానాడు వేదికపై చంద్రబాబు ఆసక్తికర ప్రసంగం
- ఎన్టీఆర్ తో తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు
- రామకృష్ణా స్టూడియోస్ లో పెళ్లి సీన్ తీస్తుండగా కలిశానని వెల్లడి
- ప్రజలకు సేవ చేయాలనుందని ఆనాడే ఆయన చెప్పారన్న చంద్రబాబు
విజయవాడలో జరుగుతున్న మహానాడు రెండో రోజు సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తాను ఎన్టీఆర్ ను తొలిసారి కలిసినప్పటి సంగతిని గుర్తు చేసుకుంటూ, ఆసక్తికర ప్రసంగాన్ని చేశారు. 1982వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పటి ఘటన ఇది.
"మొట్టమొదటిసారి... నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నప్పుడు... ఎన్టీ రామారావుగారిని కలవాలని రామకృష్ణా స్టూడియోస్ కు వెళ్లాను. అపాయింట్ మెంట్ తీసుకుని. ఇప్పటికి కూడా జ్ఞాపకం. అది 'అనురాగ దేవత' షూటింగ్... అందులో శ్రీదేవి వెడ్డింగ్ సీన్. అదెప్పటికీ నేను మరచిపోలేను. మొదటిసారి ఆయనతో మాట్లాడినప్పుడు... ఆయన చెప్పింది... 'నేను కూడా ఆలోచిస్తున్నాను. 60 సంవత్సరాల వరకూ కుటుంబ బాధ్యత నాపై ఉంది. ఇంకో సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో నా బాధ్యత పూర్తవుతుంది' అన్నారు.
ఆ తరువాత ప్రజలకు సేవ చేయాలని, తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాలని ఒక సేవాభావంతో ఆ రోజుల్లోనే ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ తరువాత పార్టీ పెట్టారు" అని అన్నారు. ఆపై జాతీయ స్థాయిలో ప్రభావం చూపారని, పలు ప్రజోపయోగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. సంక్షేమాన్ని మరో మెట్టు ఎక్కించిన ఘనత ఆయనదేనని అన్నారు. ఎన్టీ రామారావు గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న వేళ, మహానాడుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా వింటుండటం కనిపించింది.