India: ఐదేళ్లలో తొలిసారి... నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి!
- అండమాన్ ను దాటిన నైరుతి రుతుపవనాలు
- రేపు కేరళను తాకనున్న రుతుపవనాలు
- జూన్ 8 నాటికి తెలంగాణకు
నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను దాటాయి. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో, మే 28 నాటికి నైరుతి రావడం ఇదే తొలిసారి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం వరకూ విస్తరించిన రుతుపవనాలు, రేపు కేరళను తాకుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరం బంగాళాఖాతంలో గాలులు సానుకూలంగా ఉన్నాయని, అందువల్లే ముందుగానే రుతుపవనాలు వచ్చాయని, వర్షాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.
జూన్ 7 నాటికి రాయలసీమలో, 8 నాటికి తెలంగాణలో వర్షాలు కురవడం మొదలవుతుందని, ఆపై దేశమంతటికీ రుతుపవనాలు విస్తరిస్తాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్ప పీడన ద్రోణి ఉందని, దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.