Karnataka: మమతా బెనర్జీ ఆగ్రహాన్ని చవిచూసిన కర్ణాటక డీజీపీ బదిలీ వార్త అసత్యం!
- వెల్లడించిన హోమ్ మంత్రిత్వ శాఖ
- కుమారస్వామి ప్రమాణ స్వీకారం రోజున డీజీపీపై మమత ఆగ్రహం
- ఆపై ఆమెను బదిలీ చేసినట్టు వచ్చిన వార్తలు
కర్ణాటక డీజీపీ నీలమణిరాజును బదిలీ చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర హోమ్ శాఖ ఖండించింది. ఆమె బదిలీ కాలేదని, తన విధుల్లోనే కొనసాగుతున్నారని పేర్కొంది. కాగా, కుమారస్వామి కర్ణాటక సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాడు, తనకు ఎదురైన ట్రాఫిక్ అవాంతరాలపై మమతా బెనర్జీ కాస్తంత కటువుగానే స్పందించిన సంగతి తెలిసిందే.
ప్రమాణ స్వీకార వేదికపైనే నీలమణిరాజును కడిగేసిన ఆమె, ట్రాఫిక్ నిర్వహణ ఇలాగేనా? అంటూ మండిపడ్డారు. ఆపై రెండు రోజుల తరువాత, నీలమణిరాజును బదిలీ చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. కర్ణాటక తొలి మహిళా డీజీపీగా గత సంవత్సరం నవంబర్ లో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. డీజీపీగా ఎవరినైనా నియమిస్తే, రెండేళ్లు బదిలీ చేసేందుకు వీలుండదన్న నిబంధనలున్నాయి. కాగా, జనవరి 31, 2020న ఆమె పదవీ విరమణ చేయనున్నారు.