India: మమ్మల్ని అయితే అందరూ అడుగుతారు కానీ.. భారత్‌ను ఒక్కసారైనా అడిగారా?: ముషారఫ్ అక్కసు
- అణ్వాయుధాల విషయంలో పక్షపాతం
- పాక్‌ను అడిగేవారు భారత్‌ను పల్లెత్తు మాటనడం లేదు
- మోదీ శాంతి చర్చల వ్యతిరేకి
అణ్వస్త్రాల విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య ప్రపంచ దేశాలు పక్షపాతం చూపిస్తున్నాయని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నిష్టూరమాడారు. ‘వాయిస్ ఆఫ్ అమెరికా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అణ్వస్త్రాలను సమకూర్చుకునే విషయంలో నియంత్రణ పాటించమని భారత్‌ను ఎవరూ అడగడం లేదని, అదే పాక్‌ను అయితే పదపదే ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. నిజానికి భారత్ అణ్వస్త్రాలను బూచిగా చూపి భయపెడుతుండడం వల్లే పాక్ అణ్వస్త్ర దేశంగా మారిందని ముషారఫ్ వివరించారు.
భారత్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత అమెరికాపై ఉందన్న ముషారఫ్.. తామెప్పుడూ అమెరికాకు విశ్వాసపాత్రంగా ఉన్నట్టు చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య సయోధ్య ఉండేదని, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ శాంతి చర్చలకు అనుకూలం కాదని ముషారఫ్ ఆరోపించారు.