madala Rangarao: వెండితెరపై విప్లవాన్ని ఆవిష్కరించిన మాదాల రంగారావు కన్నుమూత!
- 69 సంవత్సరాల వయసులో కన్నుమూత
- గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స
- సంతాపం తెలుపుతున్న చిత్ర ప్రముఖులు
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో శ్వాసకోశ సంబంధ వ్యాధికి చికిత్స తీసుకుంటూ, వెంటిలేటర్ పై ఉన్న విప్లవ చిత్రాల కథానాయకుడు, సినీ నిర్మాత మాదాల రంగారావు కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
విప్లవ భావాలతో కూడిన చిత్రాల్లో నటించి, తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయనది. సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిని తన సినిమాల్లో చూపించారు. 'చైర్మన్ చలమయ్య' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన మాదాల రంగారావు, ఆ తరువాత నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తొలిసారిగా 'యువతరం కదిలింది' చిత్రాన్ని తీసి, బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు.
అనంతరం ఎర్రమల్లెలు, ఎర్ర పావురాలు, మరో కురుక్షేత్రం, మహా ప్రస్థానం, నవోదయం, విప్లవశంఖం, బలిపీఠంపై భారతనారి, ఎర్ర సూర్యుడు, ఎర్ర పావురాలు, ప్రజాశక్తి, స్వరాజ్యం తదితర జనం మెచ్చిన చిత్రాల్లో ఆయన నటించారు. మాదాల మృతిపై టాలీవుడ్ పెద్దలు సంతాపాన్ని తెలియజేశారు.