India: దేశం ఇప్పుడు సరైన దారిలో నడుస్తోంది: తన నాలుగేళ్ల పాలనపై మోదీ
- పేదల కష్టాలు నాకు తెలుసు
- ఇప్పుడు ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం కలిగింది
- బీజేపీ పాలన నీతిబద్ధమైనది
- అందుకే కర్ణాటకలో ప్రజలు మాకు ఓట్లు వేశారు
కాంగ్రెస్ పార్టీ పాలనతో విసిగిపోయిన ప్రజలు దేశానికి నరేంద్ర మోదీ నాయకత్వం కావాలంటూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి జై కొడుతూ ఆ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మోదీ తన నాలుగేళ్ల పాలనపై ప్రసంగించారు. ఒడిశాలోని కటక్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాలుగేళ్లలో ఎన్నో ప్రజాకర్షక పథకాలను అమలు చేశామని అన్నారు.
తమ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగానే ఉంటుందని, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మోదీ అన్నారు. తమ పార్టీ మీద నమ్మకంతో ప్రజలు గత ఎన్నికల్లో తమను ఎన్నుకొన్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ పార్టీ ఎల్లప్పుడూ నడుచుకుంటుందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం కలిగిందని అన్నారు.
తాను కూడా పేద కుటుంబంలోనే పుట్టానని, వారి కష్టాలు తనకు తెలిసినంతగా ఎవరికీ తెలిసి ఉండదని మోదీ చెప్పుకొచ్చారు. బీజేపీ పాలన నీతిబద్ధమైంది కాబట్టే కర్ణాటకలో ప్రజలు తమ పార్టీని అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారని అన్నారు. దేశం ఇప్పుడు సరైన దారిలో నడుస్తోందని వ్యాఖ్యానించారు.