rashid khan: మోదీ గారూ, మా రషీద్ ను ఇండియాకు ఇవ్వలేం!: ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడి సరదా ట్వీట్
- అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్
- జడేజాను తీసుకుని.. రషీద్ ను ఇవ్వాలని కోరుతున్న నెటిజెన్లు
- రషీద్ ను చూసి గర్విస్తున్నామన్న ఆఫ్ఘాన్ అధ్యక్షుడు
ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ, క్రికెట్ అభిమానుల మనసులను కొల్లగొడుతున్నాడు. సన్ రైజర్స్ జట్టు తరపున ఆడుతున్న రషీద్ నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో, రషీద్ పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ ఆనందంలో జడేజాను ఆఘ్ఘనిస్థాన్ కు ఇచ్చేసి, రషీద్ ను మనం తీసుకుందామని కొందరు నెటిజన్లు సరదాగా ట్వీట్ చేశారు. రషీద్ కు భారత పౌరసత్వం ఇవ్వాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు మరికొందరు ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో మోదీని ఉద్దేశించి ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ట్వీట్ చేశారు. "మా హీరో గురించి ఆఫ్ఘనిస్థానీలంతా గర్వంగా ఉన్నారు. మా ప్లేయర్లు తమ ఆటను ప్రదర్శించడానికి అవసరమైన అవకాశాన్ని కల్పించినందుకు భారతీయ స్నేహితులకు ధన్యవాదాలు. ఆఫ్ఘనిస్థాన్ గొప్పదనాన్ని రషీద్ మళ్లీ గుర్తుకు తెచ్చాడు. క్రికెట్ ప్రపంచానికి అతను ఒక ఆస్తి. అయితే, మేము రషీద్ ను మాత్రం ఇండియాకు ఇవ్వలేం" అంటూ సరదాగా ట్వీట్ చేశారు.