LPG SUBSIDY: ప్రధాని ‘ఎల్పీజీ సబ్సిడీ’ పిలుపునకు స్పందించినది 4 శాతం మందే!
- ప్రధాని స్వరాష్ట్రంలో 4 శాతం ముందే సబ్సిడీ త్యాగం
- ఈశాన్య రాష్ట్రాల్లో అనూహ్య స్పందన
- సబ్సిడీ వదులుకున్న 10 శాతానికిపైగా కస్టమర్లు
- ఏపీలో ఒక్క శాతం మందిలోనే కదలిక
వంటగ్యాస్ పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని స్వచ్చందంగా వదులుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునివ్వగా, దీన్ని 4 శాతం మంది వరకు అందిపుచ్చుకున్నారు. 'మాకొద్దు సబ్సిడీ' అని త్యాగం చేశారు. సమాజంలో ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న వారు స్వచ్చందంగా వంటగ్యాస్ పై సబ్సిడీ వదులుకోవాలని, దీనివల్ల ప్రభుత్వం పేద వర్గాలకు మరింత సబ్సిడీకి వంటగ్యాస్ ను అందించగలదని ప్రధాని 2015 మార్చిలో పిలుపునిచ్చారు.
దీనికి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా స్పందించారు. మిజోరాంలో 14 శాతం మంది కస్టమర్లు సబ్సిడీని వెనక్కిచ్చేశారు. నాగాలాండ్ లో 12 శాతం మంది, మణిపూర్ లో 10 శాతం మంది, ఢిల్లీలో 12 శాతం, మహారాష్ట్రలో 6 శాతం, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో 5 శాతం మంది చొప్పున, యూపీ, మధ్యప్రదేశ్ లో 4 శాతం చొప్పున, బిహార్, ఛత్తీస్ గఢ్, తమిళనాడులో 3 శాతం చొప్పున, పశ్చిమబెంగాల్ లో 2 శాతం మంది, ఏపీలో ఒక్క శాతం మందే సబ్సిడీని వదులుకున్నారు. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్ లో 4 శాతం మందే ఇలా ముందుకు వచ్చారు. మొత్తం మీద 2016 నాటికి కోటి మంది సబ్సిడీని విడిచి పెట్టగా, ఆ తర్వాత నాలుగు లక్షల మందే ఇలా ముందుకు వచ్చారు.