Hyderabad: ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానా: కేటీఆర్
- ప్రజా రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తాం
- దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు
- మూడో దశ మెట్రో అక్టోబర్‌లో ప్రారంభం
ఇకపై హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే భారీ జరిమానా విధిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామని, 3,800 ఆర్టీసీ బస్సుల స్థానంలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అలాగే, మూడో దశ మెట్రోను ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ మధ్యలో ఉన్న పరిశ్రమలను ఏడేళ్లలో ఫార్మాసిటీకి తరలిస్తామని, నగరంలో ప్రత్యేక ఆటోల ద్వారా రోజుకు 4,800 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నామని అన్నారు. హైదరాబాదీయులు 2 వేలకు పైగా వీధి కుక్కలను దత్తత తీసుకున్నారని, ఈ కార్యక్రమం ప్రారంభించిన జీహెచ్‌ఎంసీకి అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.