TTD: టీటీడీలో మరో లొల్లి... ప్రధానార్చక పదవి కోసం పోటాపోటీ!
- తమనే నియమించాలని డిమాండ్
- ఈఓను కోరిన గొల్లపల్లి, తిరుపతమ్మ వంశీయులు
- తమకు అనాదిగా అన్యాయం జరుగుతున్నదని లేఖ
- ఇంకా స్పందించని టీటీడీ
టీటీడీలో ప్రధానార్చకుడిగా రమణ దీక్షితులును తొలగించిన తరువాత ఏర్పడిన వివాదం ఇంకా సద్దుమణగక ముందే మరో లొల్లి మొదలైంది. స్వామివారికి ప్రధానార్చకులుగా తమనే నియమించాలని గొల్లపల్లి, తిరుపతమ్మ వంశీయులు డిమాండ్ చేస్తున్నారు. మిరాశీ వ్యవస్థను రద్దు చేసిన తరువాత తమ కుటుంబాలకు అన్యాయం జరిగిందని, రమణ దీక్షితుల తరువాత తామే సీనియర్లమని చెబుతూ, ప్రధానార్చక హోదా కోసం ఈఓకు లేఖలు పంపారు.
కాగా, అర్చకుల లేఖపై టీటీడీ అధికారులు ఇంకా పెదవి విప్పలేదు. మరోవైపు టీటీడీ ఉద్యోగులు నేడు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. అయితే, భక్తుల నుంచి వచ్చిన విమర్శలతో ఈ నిరసనలు తిరుపతికి మాత్రమే పరిమితం అయ్యాయి. తిరుపతిలోని వివిధ టీటీడీ అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు మాత్రమే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.