Karnataka: ఐదేళ్లూ సీఎంగా కుమారస్వామే అన్నది ఇంకా నిర్ణయించలేదు!: ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర!
- విశ్వాస పరీక్ష నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు
- ఇప్పటికింకా డిసైడ్ కాలేదన్న పరమేశ్వర
- అధికార పంపిణీపై చర్చించలేదని వెల్లడి
మరికొన్ని గంటల్లో కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామే ఐదేళ్లూ సీఎంగా ఉండాలని తామేమీ నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశాడు.
బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, "ఇప్పటికి ఇంకా మంత్రి పదవుల పంపకాలపైనా చర్చలు సాగలేదు. ఐదేళ్లూ ఆయనే సీఎం అని మేమేమీ అనుకోలేదు. మాకూ అవకాశాలు ఉన్నాయి. అసలు అధికార పంపిణీపై ఇప్పటివరకూ చర్చించలేదు" అన్నారు. ప్రభుత్వం నుంచి సుపరిపాలనను తాము కోరుకుంటున్నామని తెలిపారు.
కాగా, చెరో రెండున్నరేళ్లు సీఎం కుర్చీని పంచుకోవాలని కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన రాగా, కుమారస్వామి దాన్ని తిరస్కరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.