Indian railway: రైల్వే ప్రయాణికుల హస్త లాఘవం.. టాయిలెట్ మగ్గులు కూడా వదలడం లేదట!

  • రైలులోని ఏ వస్తువునూ వదలని దొంగలు
  • రూ.2.97  కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం
  • ఏడాదికేడాదికీ పెరుగుతున్న దొంగతనాలు

కాదేదీ దొంగతనానికి అనర్హం.. అనుకున్నారో, ఏమో! ప్రయాణికులు రైలు టాయిలెట్‌లోని మగ్గులను కూడా వదలడం లేదట. చైన్‌తో లాక్ చేసి ఉన్నప్పటికీ వాటిని యథేచ్ఛగా దొంగిలించుకు పోతున్నారు. మగ్గులు మాత్రమే కాదు.. సీలింగ్ ఫ్యాన్లు, బెడ్ లైనెన్లు, దుప్పట్లు, బాత్ రూం షవర్లు, కిటికీ ఐరన్ గ్రిల్స్.. ఇలా అన్నింటినీ దోచుకెళ్తున్నట్టు తేలింది. 2017-18లో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) ప్రయాణికుల నుంచి రూ.2.97 కోట్ల విలువైన ఇటువంటి వస్తువులను స్వాధీనం చేసుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది రెండింతలని ఆర్‌పీఎఫ్ తెలిపింది.

రైలు దిగేముందు ప్రయాణికులు లైనెన్లను తమ బ్యాగుల్లో వేసుకోవడాన్ని తాము చాలాసార్లు గమనించామని ఆర్‌పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. డ్రగ్స్‌కు, మద్యానికి బానిస అయిన వారు టాయిలెట్ మగ్గులు, ఇతర ఇనుప సామాన్లను దొంగిలించడం పరిపాటిగా మారిందని, తర్వాత వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా ట్రాక్ మెటీరియల్స్‌ను కూడా దోచుకుపోతుండడం తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.

రైల్వే ట్రాక్స్, ఫిష్ ప్లేట్లు, వాష్ బేసిన్లు, అద్దాలు, ట్యాప్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ కోసం ఉపయోగించే ఓవర్ హెడ్ కేబుల్స్, సోలార్ ప్లేట్లు, రిలే, టెలిఫోన్లు, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కోచ్ ఫ్యాన్లు, స్విచ్‌లు తదితరాలు దొంగల ఫేవరెట్ టార్గెట్‌గా మారుతున్నాయని వివరించారు.

2016-17లో ఆర్‌పీఎఫ్ 5,219 కేసుల్లో 5,458 మందిని అరెస్ట్ చేసింది. వారి నుంచి రూ.1.58 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. 2017-18లో కేసుల సంఖ్య 5,239కి చేరుకుంది.

  • Loading...

More Telugu News