Congress: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలతో పొత్తు: కాంగ్రెస్
- వివరించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్
- ఈ ఏడాది చివర్లో మధ్య ప్రదేశ్ ఎన్నికలు
- ఓట్లను చీల్చుతూ బీజేపీ లాభం పొందుతోందని వ్యాఖ్య
కర్ణాటకలో బీజేపీకి అధికారం దక్కనివ్వకుండా జేడీఎస్‌కి మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ మరిన్ని రాష్ట్రాల్లోనూ అధికారం సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో పలు పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసి విజయం సాధించాలని యోచిస్తోంది. ఈ రోజు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ... తాము సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో కలిసి పోటీ చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు.
తాము యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని, అదే విధంగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ ముందుకు వెళ్లే అంశంపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఓట్లను చీల్చుతూ బీజేపీ లాభం పొందుతోందని, ఇకపై ఆ అవకాశం ఇవ్వబోమని అన్నారు. పొత్తు విషయమై తాము ఎస్పీ, బీఎస్పీలతో పాటు గోండ్‌వానా గణతంత్ర పార్టీతో కూడా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. బీజేపీ పాలనలో తమ రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ దారుణంగా తయారయిందని అన్నారు.