Gujarath: పరీక్షలో చూసిరాత కోసం.. విద్యార్థులు తెచ్చిన చిట్టీల బరువు రెండొందల కిలోలు!
- 12వ తరగతి సైన్స్ పరీక్షకు చిట్టీలతో వచ్చిన విద్యార్థులు
- బయటపడ్డ చిట్టీలు రెండొందల కిలోలు
- రెండు గోనె సంచులకు సరిపడ చిట్టీలు!
ఏదోవిధంగా పరీక్షల్లో గట్టెక్కితే చాలనుకునే విద్యార్థులు చిట్టీలు (స్లిప్స్) పెట్టుకుని వెళుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఎగ్జామినర్ కంటపడకుండా వెంట తెచ్చుకున్న చిట్టీలను జాగ్రత్తగా రాసుకుని బయటపడే విద్యార్థులు కొందరైతే, పట్టుబడే విద్యార్థులు కొందరుంటారు.
ఇక విషయానికొస్తే, గుజరాత్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చెప్పుకోవాలి. జునాగఢ్ జిల్లాలోని వంథాలీలో ఇటీవల 12వ తరగతి సైన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు కొందరు చిట్టీలు తీసుకుని వచ్చారు. సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు తమ వద్ద ఉన్న చిట్టీలను ఆయా విద్యార్థులు పరీక్ష ప్రారంభమవడానికి ముందే బయటపెట్టారు. ఆ విద్యార్థులు బయటపెట్టిన చిట్టీలు ఇరవై గోనె సంచులకు సరిపడా ఉండటంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
ఈ సంఘటనపై డీఈవో బీఎస్ కెల్లా మాట్లాడుతూ, స్వామి నారాయణ్ గురుకుల్ పరీక్షా కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ మార్చి 14న తమకు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లినట్టు చెప్పారు. ఆరోజున పదో తరగతి పరీక్ష జరుగుతోందని అన్నారు. చిన్న చిన్న కాగితాలతో అక్కడి రోడ్లు నిండిపోయాయని, అవి అంతకుముందు జరిగిన పరీక్షలకు సంబంధించిన చిట్టీలని చెప్పారు.
దీంతో, 12వ తరగతి విద్యార్థులందరినీ తమ వద్ద ఉన్న చిట్టీలన్నీ వెనక్కి ఇచ్చివేయాలని మూడుసార్లు హెచ్చరించడంతో ఆ చిట్టీలను బయటపెట్టారని అన్నారు. విద్యార్థులు ఇచ్చినవి, అధికారులు స్వాధీనం చేసుకున్నవి మొత్తం రెండు వందల కిలోల చిట్టీలు అయ్యాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.