Telugudesam: మహానాడులో కేసీఆర్ కు వ్యతిరేకంగా పాటలు.. వారించిన ఎల్.రమణ!
- కళాకారులు అనుచిత పదాలు వాడటం మంచిది కాదు
- నాయకులు తప్పులు చేస్తే సమాజమే శిక్షిస్తుంది
- తెలంగాణలో చరిత్రను మళ్లీ తిరగరాస్తాం
హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ టీడీపీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. అంతకు ముందు కళాకారులు పాటలు పాడుతూ ఆహూతులను ఉల్లాసపరిచారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా వారు పాటలు పాడారు. ఈ పాటలలో అనుచిత పదజాలం ఉండటం పట్ల టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాయకులు తప్పులు చేస్తే, సమాజమే శిక్షిస్తుందని... కళాకారులు అనుచిత పదాలు వాడటం మంచిది కాదని హితవు పలికారు.
ఈ సందర్భంగా ఎల్.రమణ ప్రసంగిస్తూ, వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు టీడీపీని వీడారని చెప్పారు. చంద్రబాబు అండతో తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని, చరిత్రను తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని అన్నారు.