tejaswi yadav: కోహ్లీ ఛాలెంజ్ స్వీకరించారు.. మరి మా ఛాలెంజ్ కూడా స్వీకరించండి, మోదీ సార్: తేజస్వి యాదవ్
- మోదీకి ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన కోహ్లీ
- త్వరలోనే తన ఫిట్ నెస్ వీడియోను పోస్ట్ చేస్తానన్న మోదీ
- సమస్యలపై ఛాలెంజ్ ను స్వీకరిస్తారా? అని ప్రశ్నించిన తేజస్వి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్ ను ప్రధాని మోదీ స్వీకరించడంపై లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. కోహ్లీ విసిరిన ఛాలెంజ్ ను మీరు స్వీకరించడం పట్ల ఎవరికీ, ఎలాంటి అభ్యంతరాలు లేవని... మరి, మా ఛాలెంజ్ ను కూడా స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు. రైతులకు ఉపశమనం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, దళితులు, మైనార్టీల పట్ల హింస తదితర సవాళ్లను కూడా మీరు స్వీకరించాలని కోరుతున్నామని చెప్పారు. 'మా ఛాలెంజ్ ను స్వీకరిస్తారా మోదీ సార్?' అని ప్రశ్నించారు.
విరాట్ కోహ్లీకి కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్ ద్వారా ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన కోహ్లీ... జిమ్ లో తాను చేస్తున్న వర్కవుట్స్ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తన ఫిట్ నెస్ ఛాలెంజ్ ను స్వీకరించాలంటూ ప్రధాని మోదీ, తన భార్య అనుష్క, క్రికెటర్ ధోనీలను కోరాడు. కోహ్లీ ఛాలెంజ్ ను స్వీకరించిన మోదీ... త్వరలోనే తన ఫిట్ నెస్ వీడియోను పోస్ట్ చేస్తానని పేర్కొన్నారు.