basavatarakam: బసవతారకం హాస్పిటల్లో కొత్త యూనిట్ ప్రారంభించిన బాలకృష్ణ, కేటీఆర్
- అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ప్రారంభం
- సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
- అవసరమైన వారంతా ఉపయోగించుకోవాలన్న మంత్రి
హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఈరోజు అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బసవతారకం హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, బసవతారకం ఆసుపత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. అవసరమైనవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, దివంగత ఎన్టీఆర్ మీద అభిమానంతో తన కుమారుడికి తారకరామారావు అని కేసీఆర్ పేరు పెట్టడం సంతోషకరమని చెప్పారు. కేటీఆర్ చేతుల మీదుగా ఈ యూనిట్ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్యాన్యర్ బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 40 బెడ్స్ తో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుందని అన్నారు.
సినిమాలు, రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, బసవతారకం ఆసుపత్రి విషయంలో బాలయ్య ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పర్యవేక్షిస్తుంటారు. ఆసుపత్రిలో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఆయన చాలా సీరియస్ గా తీసుకుంటారని చెప్పుకుంటుంటారు.