BJP: లోక్ సభలో అనూహ్య రీతిలో మైనారిటీలో పడ్డ బీజేపీ!

  • కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ ఎత్తులు
  • అధికారం దక్కకపోగా చిక్కులు
  • ఇప్పటికే పలు ఎంపీ సీట్ల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
  • 282 నుంచి 272కు పడిపోయిన బీజేపీ బలం

కర్ణాటకలో కాంగ్రెస్ ను దించేసి, ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చేసిన పనులు, ఇప్పుడా పార్టీని లోక్ సభలో మైనారిటీలో పడేశాయి. కర్ణాటకలో చేసిన రాజకీయాలతో ఇప్పటికే పరువు పోగొట్టుకున్న ఆ పార్టీ, ఇప్పుడు మరింత ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం బీజేపీ లోక్ సభలో కనీస మెజారిటీకి ఒక్క స్థానం తక్కువలో ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో 282 ఎంపీ సీట్లల్లో గెలిచి సొంతంగా బలమున్నా, భాగస్వామ్య పక్షాలతో కలసి ప్రభుత్వం ప్రారంభించిన బీజేపీ ఎంపీల సంఖ్య ఇప్పుడు 272కు తగ్గపోయింది.

మొత్తం 544 మంది సభ్యులుండే లోక్ సభలో సగానికి ఒకటి ఎక్కువగా... అంటే 273 మంది బలముంటే సాధారణ మెజారిటీ ఉన్నట్టు. బీజేపీ ఎంపీలు యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్యలు రాజీనామా చేయగా, ఆ స్థానాలను బీజేపీ కోల్పోవడంతో బీజేపీకి బలం తగ్గడం మొదలైంది. బీజేపీ ఎంపీల మరణంతో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆపై తమ పార్టీ ఎంపీ కీర్తీ ఆజాద్ ను బీజేపీ సస్పెండ్ చేసి మరో స్థానాన్ని కోల్పోయింది.

ఇక ఆ తరువాత 'కర్నాటకం' మొదలైంది. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలయిన యడ్యూరప్ప, శ్రీరాములు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. ఎంపీలుగా ఉంటే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో బల పరీక్షలో పాల్గొనే అవకాశం లేదు. ఇదే సమయంలో సీఎంగానూ ప్రమాణ స్వీకారం కుదరదు. దీంతో యడ్యూరప్ప, శ్రీరాములు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే వాటిని ఆమోదించినట్టు కూడా లీకులు వచ్చాయి. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బల పరీక్ష అయితే జరగలేదుగానీ, యడ్యూరప్ప సీఎం పదవిని పోగొట్టుకున్నారు. ఇక శ్రీరాములుతో తన రాజీనామాను వెనక్కు తీసుకుంటున్నట్టు లేఖ రాయించాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తనకున్న అధికార బలంతో యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను వెనక్కు తీసుకుంటే, ఎమ్మెల్యేలుగా పనికిరారు. అంటే కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగాలి.

ఆ విషయాన్ని పక్కనపెడితే, ఈ మొత్తం వ్యవహారం బీజేపీని విమర్శించేందుకు కాంగ్రెస్ తదితర విపక్షాలకు మరో బ్రహ్మాస్త్రాన్ని అందించినట్టే. ఇప్పటికే మోదీపై ఎంపీల్లో వ్యతిరేకత ఉంది. శతృఘ్నసిన్హా వంటి అసంతృప్తులతో పాటు రిజర్వ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎంపీలు మోదీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా లేరు. పైగా నరేంద్ర మోదీకి 2014లో ఉన్న అనుకూలత ఇప్పుడు లేదు. ముందు నుయ్యి, వెనక గొయ్యిలా శ్రీరాములు, యడ్యూరప్ప రాజీనామాల వ్యవహారం సాగుతోంది. వారి రాజీనామాలను ఆమోదిస్తే సభలో బీజేపీ బలం 272 మాత్రమే అవుతుంది. ఆమోదించకుంటే, 'ప్రజాస్వామ్యం ఖూనీ' అంటూ విమర్శలు వస్తాయి. కర్ణాటక ఎంపీల రాజీనామాలను ఆమోదించడం లేదని చెబితే, బీజేపీకి, ఇంత కంటే పరువు తక్కువ వ్యవహారం మరొకటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఎటొచ్చీ, మోదీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే, ఎన్డీయేలోని అకాలీ దళ్, లోక్ జనశక్తి, జేడీయూ వంటి ఇతర పార్టీల సభ్యులు 12 మంది వరకు వున్నారు.

  • Loading...

More Telugu News