Nitin Gadkari: పెట్రోలు ధరలు తగ్గిస్తే కష్టమే: నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- ఆర్థిక వ్యవస్థతో ముడిపడివున్న 'పెట్రో' ధరలు
- ధరలు తగ్గిస్తే సంక్షేమంపై ప్రభావం
- పేదలకు చేరాల్సిన సాయం అందదన్న గడ్కరీ
ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డుకు చేరి, మరింతగా పైకి వెళుతున్న 'పెట్రో' ఉత్పత్తుల ధరలను తగ్గిస్తే, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు కష్టతరం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో వందల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, మరికొన్ని పథకాలకు రూపకల్పన చేస్తుందని చెప్పిన ఆయన, పెట్రోలు, డీజిల్ ధరలపై సబ్సిడీ ఇస్తే, దాని ప్రభావం పథకాలపై పడుతుందని అభిప్రాయపడ్డారు.
కాగా, సమీప భవిష్యత్తులో పెట్రోలు ధర లీటరుకు రూ. 100 మార్క్ ను తాకుతుందని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో, ధరల పెరుగుదలకు మీరంటే మీరే కారణమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే.
"మనం ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నాం. పెట్రోలు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడివున్నాయి. ప్రజలకు ఊరట లభించేలా మనం 'పెట్రో' ఉత్పత్తులను చౌకగా విక్రయించాలంటే, అధిక ధరలకు వాటిని కొని, సబ్సిడీ అందించాల్సిందే. పెట్రోలుపై సబ్సిడీ అంటే, సంక్షేమ పథకాలకు వాడుతున్న డబ్బంతా ఆవిరైపోతుంది. సబ్సిడీ అందిస్తే, మనవద్ద అతికొద్ది మొత్తంలో మాత్రమే డబ్బుంటుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక పెట్రోలుపై పన్నులను తగ్గించినా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని, పేదలకు ఉచిత ఎల్పీజీని అందించే ఉజ్వలా స్కీమ్ తో పాటు, నీటి పారుదల పథకాలు, గ్రామీణ విద్యుదీకరణ పథకాలపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.