Nara Lokesh: ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నారు: నారా లోకేశ్
- ఉద్ధానం విషయంలో అన్ని చర్యలూ తీసుకుంటున్నాం
- ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్స్ ఏర్పాటు చేశాం
- డయాలిసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్ధానంలోని సమస్యలను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకొచ్చారని దానిపై దృష్టి పెట్టి పలు కార్యక్రమాలను చేపట్టామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తాను తాగునీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతోనే ఉద్ధనంపై శ్రద్ధ తీసుకున్నానని తెలిపారు.
అక్కడ ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్స్ ఏర్పాటు చేశామని లోకేశ్ తెలిపారు. ముఖ్యమంత్రి నియోజక వర్గానికి వెళ్లాల్సిన ప్లాంట్లను వెంటనే ఉద్ధానానికి తరలించి అక్కడ ప్రారంభించామని తెలిపారు. ఇందుకోసం కొంత సమయం పట్టిందని, ప్రస్తుతం నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. డయాలిసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామని, పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. అన్నీ చేస్తున్నామని, ఇంకా చేయాల్సి ఉందని అన్నారు. ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో పవన్ కల్యాణ్ ఉద్ధానం విషయంలో విమర్శలు చేస్తున్నారని అన్నారు.