shivaparvathi: నన్ను గౌరవించడం లేదని నేను ఫీలైపోను: నటి శివపార్వతి
- సినిమాలు చేస్తూ వెళ్లాను
- టీవీ సీరియల్స్ వైపు వచ్చాను
- పాత్ర గురించి తప్ప మరేమీ పట్టించుకోను
కుటుంబ కథాచిత్రాలలో శివపార్వతి ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చారు. ధారావాహికల్లోను నటన పరంగా ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి ఆమె తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ గురించి ముచ్చటించారు.
"సినిమాల నుంచి సీరియల్స్ కి రావడమంటే ఒక మెట్టు పైకెక్కి మళ్లీ కిందికి దిగడం లాంటిది. సినిమాల నుంచి సీరియల్స్ వైపుకు వచ్చాక అక్కడి ట్రీట్మెంట్ ఎలా అనిపించింది?" అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అందుకు శివపార్వతి స్పందిస్తూ .. "నేను నా పాత్రను గురించే తప్ప .. నాకిచ్చే మర్యాదలను గురించి ఆలోచించను. ఇప్పుడు వచ్చిన వాళ్లకి శివపార్వతి ఎవరో తెలియదు. వాళ్లకి తెలియదు కనుక ఆ స్థానంలో సావిత్రి గారు వచ్చి కూర్చున్నా అలాగే ప్రవర్తిస్తారు. పసిపిల్లాడికి పాము ఇస్తే మెడలో వేసుకుంటాడు .. అలా వాళ్లది తెలియనితనమే అనుకుంటానుగానీ, అహంభావం అనుకోను. నన్ను గౌరవించడం లేదే అని ఫీలైపోను" అంటూ చెప్పుకొచ్చారు.