shivaparvathi: అవకాశాలు తగ్గాయి .. కారణం అదేననుకుంటున్నాను: నటి శివపార్వతి
- టీవీ సీరియల్స్ ఎక్కువగా చేస్తున్నాను
- సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గాయి
- కొత్త దర్శకులు ఛాన్స్ ఇస్తారనే చూస్తున్నాను
అటు వెండితెరపై .. ఇటు బుల్లితెరపై ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ శివపార్వతి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి శివపార్వతి ఈ మధ్య కాలంలో బుల్లితెరపైనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే విషయాన్ని గురించిన ప్రస్తావన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రాగా ఆమె తనదైన శైలిలో స్పందించారు.
" ప్రస్తుతం టీవీ సీరియల్స్ చేస్తూ బిజీగా వున్నాను .. ఒక రకంగా చెప్పాలంటే టీవీ నన్ను దత్తత చేసుకుంది. సినిమాలు చేయడంలేదని చెప్పను .. అవకాశాలు బాగా తగ్గాయి .. అవకాశాలిస్తే చేయాలనే ఆశ వుంది. గతంలో మాకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు సినిమాలు చేయడం తగ్గించడం .. కొత్త దర్శకులు ఎక్కువగా రావడం .. వాళ్లకి మేం తెలియకపోవడమే ప్రధానమైన కారణమని అనుకుంటున్నాను. ఫలానా పాత్ర శివపార్వతి అయితే బాగా చేస్తుందని వాళ్లకి తెలిసి .. తప్పకుండా పిలుస్తారనే ఆశతోనే వున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.