Tata Motors: ఇండికా, ఇండిగో ఇక కనుమరుగు... శాశ్వతంగా నిలిపేసిన టాటా!
- మార్చి నుంచి ఉత్పత్తి నిలిపివేత
- ఒక్క యూనిట్ కూడా తయారు కాలేదన్న సియామ్
- బీఎస్-6కు అప్ గ్రేడ్ చేయలేకనే
- త్వరలో నానో తయారీ కూడా నిలిపివేత
- ఈ- వెహికిల్ గా రూపాంతరం చెందనున్న నానో
మధ్యతరగతి ప్రజలు అమితంగా ఆదరించిన చిన్న కార్లు టాటా ఇండికా, టాటా ఇండిగో కార్ల తయారీని టాటా మోటార్స్ నిలిపివేసింది. ఈ సంవత్సరం మార్చి నుంచి ఇండికా, ఇండిగో కార్లు ఒక్కటి కూడా తయారు కాలేదని, ప్రస్తుతం అమ్మకానికి ఉన్నవి పాత స్టాక్ అని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఇంపాక్ట్ డిజైన్ కార్లు వచ్చిన తరువాత, వాటికి ఆదరణ పెరగడంతో, తక్కువ సేల్స్, పాత డిజైన్ లో ఉన్న కార్లను నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే టాటా మోటార్స్ ఈ నిర్ణయాన్ని తీసుకుందని తెలుస్తోంది. కాగా, గత సంవత్సరంలో 1,666 యూనిట్ల ఇండికాలను, 556 యూనిట్ల ఇండిగో సెడాన్ లను మాత్రమే తయారు చేసిన సంస్థ, ఆపై వాటి ఉత్పత్తిని పూర్తిగా ఆపేసింది.
ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి ఒకరు నిర్థారించారు. కార్ల కొనుగోలుదారుల ఆలోచనలు మారుతున్నాయని, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న కార్లను వారు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ కార్లను క్రమంగా తగ్గించాలని నిర్ణయించామని అన్నారు. ఇదే సమయంలో బీఎస్-6కు కార్లను అప్ గ్రేడ్ చేయాల్సి వున్నందున, మరిన్ని పెట్టుబడులు పెట్టలేకనే, ఈ కార్ల తయారీకి సంస్థ మంగళం పలికినట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని మరో రెండేళ్లలో ఓ సరికొత్త ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారును విడుదల చేయాలన్నది టాటా మోటార్స్ ఆలోచనగా తెలుస్తోంది.
ఇదిలావుండగా, టాటా ఇండికాకు ఘనమైన గత చరిత్రే ఉంది. 1998లో తొలిసారిగా 'మోర్ కార్ పర్ కార్' అంటూ జనీవాలో జరిగిన వాహన ప్రదర్శనలో ఈ కారును తొలిసారిగా టాటా కంపెనీ ప్రదర్శనకు ఉంచగా, వారం రోజుల వ్యవధిలోనే 1.15 లక్షల బుకింగ్స్ వచ్చాయి. ఓ దశలో మాస్ ట్రాన్స్ పోర్ట్ కు, క్యాబ్ సంస్థలకు ఇండికా సెగ్మెంట్ లీడర్ గా అవతరించింది. ఇక నానో కారును కూడా టాటా మోటార్స్ నిలిపేసే ఆలోచనలోనే ఉందని తెలుస్తోంది. గడచిన ఏప్రిల్ లో కేవలం 45 నానో కార్లు మాత్రమే తయారు అయ్యాయి. నానోను ఈ వెహికిల్ గా అప్ గ్రేడ్ చేయాలన్నది టాటా మోటార్స్ ఆలోచనగా తెలుస్తోంది.