amit shah: గవర్నర్ తో భేటీ అయిన ఏపీ బీజేపీ నేతలు.. చంద్రబాబుపై ధ్వజం
- అమిత్ షాపై దాడి చంద్రబాబు కుట్రే అన్న సోము వీర్రాజు
- ఇలాంటి దాడులు చంద్రబాబుకే నష్టం
- బీజేపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు
ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఏపీ బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాణిక్యాలరావు, దినేష్ రెడ్డిలు కలిశారు. అనంతరం మీడియాతో సోము వీర్రాజు మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తల మీద టీడీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. అమిత్ షా తిరుమల పర్యటన సందర్భంగా అలిపిరి వద్ద జరిగిన దాడి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రేనని ఆరోపించారు. ఇలాంటి దాడులకు పాల్పడితే చంద్రబాబుకే నష్టమని చెప్పారు. అమిత్ షాపై దాడి, ఆ తర్వాత బీజేపీ నేతలపై కేసులు పెట్టడం వంటి అంశాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తమ డిమాండ్లపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే అమిత్ షా మీద దాడి చేశారని అన్నారు. ఆ సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్రను పోషించారని మండిపడ్డారు. అమిత్ షాకు రక్షణగా ఉన్న బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి వ్యక్తికీ బీజేపీతో లింక్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో ఎన్నో అక్రమాలు బయటపడుతున్నా... దర్యాప్తుకు ఆదేశించకుండా ఎదురుదాడికి దిగుతుండటం దారుణమని అన్నారు.