Job Mela: స్నేహితులా? ప్రేమికులా?... యువజంట మృతితో తణుకులో కలకలం!
- జాబ్ మేళాకని చెప్పి బస్సులో వెళ్లిన అశ్విత
- తిరుగు ప్రయాణంలో యువకుడి బైక్ ఎక్కిన అశ్విత
- యాక్సిడెంట్ లో తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృతి
- ఆపై రైలు కింద పడి మరణించిన యువకుడు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో ఓ యువజంట అనూహ్య రీతిలో మృతిచెందారు. బైక్ పై వస్తున్న యువతీ, యువకులు రోడ్డు ప్రమాదానికి గురికాగా, యువతి ఆసుపత్రిలో మరణించింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన చోళ్ల అశ్విత (23) బీటెక్ పూర్తి చేసింది. తణుకులో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు వెళ్లొస్తానని తల్లిదండ్రులకు చెప్పిన ఆమె, బస్సులో బయలుదేరింది.
అదే గ్రామానికి చెందిన ఉన్నమట్ల సునీల్ రాజు (26) పదో తరగతి వరకూ చదివి తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. జాబ్ మేళాకు వచ్చిన అశ్విత, తిరుగు ప్రయాణంలో సునీల్ రాజు మోటార్ సైకిల్ పై కూర్చుంది. 16వ నంబరు జాతీయ రహదారిపై ఉండ్రాజవరం సమీపంలో వీరి బైక్ ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. కింద పడిన అశ్వితకు తీవ్ర గాయాలు కాగా, సునీల్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. అశ్వితను తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
అశ్వితను స్వయంగా ఆసుపత్రికి తరలించిన సునీల్ రాజు, చికిత్స జరుగుతున్నంత సేపూ ఆమె వద్దే ఉండి సపర్యలు చేశాడు. ఆమె చనిపోయిందన్న విషయాన్ని డాక్టర్లు వెల్లడించిన తరువాత, దగ్గర్లోనే ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లి, సర్కారు ఎక్స్ ప్రెస్ కింద పడ్డాడు. రెండు కాళ్లూ నుజ్జయిన పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించినా సునీల్ రాజు ప్రాణాలు దక్కలేదు.
కాగా, వీరిద్దరూ స్నేహితులా? లేక ప్రేమికులా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇద్దరూ ఒకే చర్చికి వెళతారని, గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని గ్రామానికి చెందిన కొందరు చెబుతుండగా, వీరు స్నేహితులేనని, పరిచయం ఉన్న కారణంగా అశ్విత అతని బైక్ ఎక్కి ఉంటుందని, ఆమె మరణించడంతో భయపడి సునీల్ ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని మరికొందరు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.