Pawan Kalyan: ఉద్యోగుల సొమ్ముతో ప్రభుత్వం వ్యాపారం చేయడమేంటీ?: పవన్ కల్యాణ్ ఆగ్రహం
- కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై పవన్ స్పందన
- ఆ సొమ్ముని షేర్ మార్కెట్లో పెట్టడం ఏమిటి?
- సీపీఎస్ విధానంపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతా
- ప్రభుత్వోద్యోగుల సమస్యలు ఎలా ఉంటాయో నాకు తెలుసు
ఉద్యోగుల సొమ్ముతో ప్రభుత్వం వ్యాపారం చేయడం ఏంటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తాను చేస్తోన్న పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పేరుతో ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల మూలంగా తాము ఏ విధంగా నష్టపోతున్నామనే విషయంపై బాధితులు వివరించారు. సీపీఎస్ రద్దు కోరుతూ విజ్ఞప్తులు చేసినా, నిరసన తెలిపినా సర్కార్ నుంచి ఎలాంటి స్పందనా లేదని వాపోయారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "ఉద్యోగులకు అన్యాయం జరిగితే మా పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వారి కుటుంబాలకి ఎదురయ్యే ఇబ్బందులూ తెలుసు. మా నాన్న కూడా ప్రభుత్వ ఉద్యోగే. జీవితం చివరి వరకు ఆయన ఎన్నడూ మా మీద ఆధారపడి బతకలేదు. తనకు వచ్చే పెన్షన్ మీదే బతికారు. సీపీఎస్ విధానంపై ప్రభుత్వ పెద్దలతో తప్పకుండా మాట్లాడతాను. 30 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాక ఆ పెన్షనే ఆధారంగా ఉంటుంది. ఆ సొమ్ముని షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు.
కాగా, బెంతు ఒరియా సామాజిక వర్గ ప్రజల సమస్యలను పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. తమను ఎస్టీల్లో కలపకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని పవన్‌కి వారు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం తమను ఎస్టీలుగా గుర్తిస్తున్నా, విద్య, ఉద్యోగాలకి మాత్రం అనర్హుల్ని చేస్తున్నారని అన్నారు. ఒడిశాలో తమను ఎస్టీలుగా గుర్తిస్తున్నారనీ, అలాగే ఇక్కడ కూడా గుర్తించాలన్నారు. ఈ అంశంపై బెంతు ఒరియాలతో పవన్ కాసేపు చర్చించారు.