Maharashtra: మత్స్యకన్య లక్షణాలతో జన్మించి, నిమిషాల వ్యవధిలోనే కన్నుమూత... మహారాష్ట్రలో ఘటన!
- బీడ్ ప్రాంతంలో ఘటన
- సినిమోమిలియా వ్యాధితో పుట్టిన బిడ్డ
- కాళ్లు అతుక్కుపోయి జన్మించిన పాప
మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతంలో ఓ విచిత్రం జరిగింది. మత్స్యకన్య లక్షణాలతో జన్మించిన ఓ బిడ్డ, 15 నిమిషాల తరువాత మరణించింది. ఓ పాప అత్యంత అరుదైన సెరినోమిలియా (దీన్నే మర్ మెయిడ్ సిండ్రోమ్ గా కూడా పిలుస్తారు) లక్షణాలతో జన్మించిందని, ఆమె కాళ్లు అతుకుపోయి ఉన్నాయని అంబజోగాయ్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ ప్రభుత్వ వైద్యశాల గైనకాలజిస్టు డాక్టర్ సంజయ్ బన్సోడే వెల్లడించారు. పురాణాల్లో, ఊహాజనిత కథల్లో మాత్రమే మత్స్యకన్య ప్రస్తావన ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఇక సెరినోమిలియా వ్యాధి, బిడ్డ గర్భంలో పెరిగే సమయంలో దిగువ వెన్నెముక ఎదుగుదల లోపం కారణంగా వస్తుందని ఆయన తెలిపారు. ఆమె తల్లి దీక్షా కాంబ్లీని సోమవారం ఉదయం 7 గంటల సమయంలో కాన్పు నిమిత్తం తీసుకు వచ్చారని, ఆపై ఆమె 1.8 కిలోల బరువున్న బిడ్డను కందని, ఆ బిడ్డ పుట్టిన 15 నిమిషాల తరువాత మరణించిందని, తల్లి క్షేమమేనని తెలిపారు.