Karnataka: బీజేపీ శిబిరంలోని కాంగ్రెస్ నేతలను ఎలా రప్పించామంటే...!: వెల్లడించిన డీకే శివకుమార్
- ఎమ్మెల్యేలుగా గెలవగానే మాయమైన ఇద్దరు కాంగ్రెస్ నేతలు
- రంగంలోకి దిగిన శివకుమార్
- వారిని తిరిగి కాంగ్రెస్ శిబిరానికి చేర్చడంలో కీలక పాత్ర
మూడు రోజుల క్రితం కర్ణాటకలో యడ్యూరప్ప బలపరీక్షకు ముందు జరిగిన కర్నాటకానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేత డీకే శివకుమార్ మీడియాతో పంచుకున్నారు. కాంగ్రెస్ టికెట్ పొంది విజయం సాధించిన తరువాత ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రతాప్ గౌడ పాటిల్, ఆనంద్ సింగ్ లు ఏ కాంగ్రెస్ నేతకూ అందుబాటులోకి రాకుండా మాయమైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ బీజేపీ శిబిరంలోకి చేరిపోయారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళనలో పడ్డారు. వీరి మాయం తరువాతనే క్యాంపు రాజకీయాలు తెరపైకి రాగా, కాంగ్రెస్ నేత, ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీపడ్డ అత్యంత ఆస్తిపరుల్లో ముద్రపడ్డ డీకే శివకుమార్ రంగంలోకి దిగారు.
వీరిద్దరూ ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని పసిగట్టి, వారి మనసును మార్చగలిగారు. గత శనివారం నాడు అసెంబ్లీ ప్రారంభమైన తరువాత మధ్యాహ్నం వరకూ వీరిద్దరూ అసెంబ్లీకి రాకపోవడానికి కూడా శివకుమార్ మంత్రాంగమే కారణమని తెలుస్తోంది. ఇక వీరిద్దరినీ ఎలా తిరిగి కాంగ్రెస్ దగ్గరికి చేర్చామన్న విషయమై స్పందించిన శివకుమార్, "దేవుడు నాకో మంత్రదండాన్ని ఇచ్చాడులే. దాన్ని ఉపయోగించా" అని సరదాగా వ్యాఖ్యానించారు.
"బీజేపీ స్నేహితులు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకెళ్లారని తెలిసింది. ఆపై నాకున్న వనరుల ద్వారా వారు ఎక్కడున్నారో కనిపెట్టాను. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడాను. వారిని బీజేపీ బలవంతం చేసింది. ఇందులో రహస్యం ఏమీ లేదు. బీజేపీ రాజకీయాలు ఆడింది. మేము మా స్టయిల్ లో అవే రాజకీయ ఆటలు ఆడాం" అని అన్నారు. బల పరీక్షకు గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువును సుప్రీంకోర్టు 24 గంటలకు కుదించడంతోనే తమ విజయం ఖాయమై పోయిందని శివకుమార్ అభిప్రాయపడ్డారు.