VHP: గోవధ ఆగాలంటే జీవిత ఖైదు పడే కఠిన చట్టాలు తేవాలి!: సాధ్వి సరస్వతి సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్ర చట్టాలు గోవధను ఆపలేకపోతున్నాయి
- కేంద్రమే చట్టం తేవాలి
- కేసులు పెట్టి నన్ను భయపెట్టలేరు
దేశవ్యాప్తంగా గోవధ ఆగాలంటే ఏం చేయాలో వీహెచ్‌పీ నేత సాధ్వి సరస్వతి చెప్పారు. జీవిత ఖైదు శిక్షతో కూడిన కఠిన చట్టాలు తీసుకు రావడం ద్వారా గోవధకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. జంషెడ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వి సరస్వతి మాట్లాడుతూ.. గోవధను నిరోధించేందుకు ఆయా రాష్ట్రాలు చట్టాలు చేసినప్పటికీ దేశవ్యాప్తంగా అమలయ్యేలా కేంద్రం కూడా ఓ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు గోహత్యలు ఆగవన్నారు.
సనాతన ధర్మ ప్రచార సేవా సమితి అధ్యక్షురాలైన సాధ్వి తనపై కేరళలో నమోదైన కేసు గురించి మాట్లాడుతూ అటువంటి కేసులు తనను, తన కార్యక్రమాలను ఆపలేవన్నారు. కేరళలో జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో హింసను ప్రేరేపించేలా, కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై కేసు నమోదైంది. కాగా, బీఫ్ తినడంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తన ఫేస్‌బుక్ పేజీలో 600 మందికిపైగా యూజర్లు తనను ట్రోల్ చేశారని సాధ్వి సరస్వతి పేర్కొన్నారు.