Pawan Kalyan: డబ్బు కోసం కాదు.. ఉన్న డబ్బునే వదులుకుని రాజకీయాల్లోకి వచ్చా!: పవన్ కల్యాణ్
- ప్రతి రాజకీయ పార్టీకి ‘జనసేన’ను విమర్శించడం తేలికైపోయింది
- టీడీపీ చంద్రబాబు స్థాపించిన పార్టీ కాదు, ఎన్టీఆర్ స్థాపించింది
- జనసేన మనం స్థాపించుకున్న పార్టీ
‘ఇచ్ఛాపురం జనసైనికులకు అభినందనలు’ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘జనసేన’ పోరాట యాత్ర ఈరోజు ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక రాజావారి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, ‘ప్రతి రాజకీయ పార్టీకి ‘జనసేన’ను విమర్శించడం తేలికైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించి, సమస్యలపై పోరాడటం కష్టం. జనసేన మనం స్థాపించుకున్న పార్టీ. టీడీపీ చంద్రబాబు స్థాపించిన పార్టీ కాదు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. నేను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ఉన్న డబ్బుని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చా. ‘జనసేన’కు జనబలం తప్ప మరేమీ లేదు’ అని అన్నారు. రాష్ట్రం విడిపోయాక అనుభవజ్ఞులైన నాయకులు కావాలని నాడు కోరుకున్నా, అందుకే, టీడీపీకి మద్దతిచ్చానని, ప్రత్యేకహోదా కోసమే ఆ పార్టీకి మద్దతిచ్చానని చెప్పుకొచ్చారు.