Andhra Pradesh: బీజేపీకి ఏపీ శాపం తగిలింది: డిప్యూటీ సీఎం కేఈ
- ఇప్పటికైనా బీజేపీ అధిష్ఠానం బుద్ధి తెచ్చుకోవాలి
- చిల్లర రాజకీయాలు బీజేపీకే ముప్పుతెచ్చాయి
- ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ విఫలం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు బీజేపీపై ఘాటు వ్యాఖ్యలతో పాటు విమర్శలు గుప్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ, బీజేపీకి ఏపీ శాపం తగిలిందని, ఇప్పటికైనా బీజేపీ అధిష్ఠానం బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. చిల్లర రాజకీయాలు, బేరసారాల వంటి వ్యవహారాలు బీజేపీకే ముప్పుతెచ్చాయని విమర్శించారు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుందని కర్ణాటక సంఘటన రుజువు చేసిందని చెప్పారు.
బీజేపీకి కర్ణాటక అసెంబ్లీ షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చింది
కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు నీతి నిజాయతీకి కట్టుబడి ఉన్నారని, బీజేపీకి కర్ణాటక అసెంబ్లీ షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చిందని మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగలేదని ప్రశంసించారు. అయితే, కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ వెంటాడుతూనే ఉంటుందని, ఈరోజు నుంచి మోదీ, అమిత్ షా పతనం ప్రారంభమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి తెలుగువారు తగినబుద్ధి చెప్పారు
కర్ణాటకలో బీజేపీకి తెలుగువారు తగినబుద్ధి చెప్పారని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మోదీకి దిమ్మతిరిగిందని విమర్శించారు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని, బీజేపీ ప్రలోభాలకు లొంగని కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను అభినందిస్తున్నానని అన్నారు. కాగా, మంత్రి జవహర్ మాట్లాడుతూ, బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని పరిహాసం చేసి భంగపడ్డారని, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి, ఏపీలో జగన్ కుట్రలు చేశారని విమర్శించారు. ఇలాంటి వారికి ఈ విజయం చెంపపెట్టని అన్నారు.