Pawan Kalyan: కండరాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని అక్కున జేర్చుకున్న పవన్ కల్యాణ్!

  • మస్క్యులర్ డిస్ట్రఫీతో బాధపడుతున్న చిన్నారి రేవతి
  • విశాఖలో పవన్ కల్యాణ్ ని కలిసిన రేవతి తల్లిదండ్రులు
  • బ్యాటరీ వీల్ ఛైర్ తో పాటు ఆర్థిక సాయం చేస్తానన్న పవన్
  • సంతోషం వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు

కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారి రేవతికి ఆర్థిక సాయంతో పాటు బ్యాటరీతో నడిచే వీల్ చైర్ కు ఇస్తానని  జనసేన పార్టీ అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో ఈరోజు ఉదయం ఆ కుటుంబం పవన్ కల్యాణ్ ని కలిసింది. మస్క్యులర్ డిస్ట్రఫీతో బాధపడుతున్న రేవతి పరిస్థితి చూసి ఆయన చలించిపోయారు. ఆ చిన్నారికి అవసరమైన బ్యాటరీ వీల్ ఛైర్ సమకూర్చడంతో పాటు వైద్యం కోసం మైసూరుకు వెళ్ళేందుకు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని పవన్ కోరుకున్నారు. పవన్ కల్యాణ్ హామీతో ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది.జనసేనాధిపతి ఒడిలో...

ఆరేళ్ళ ఆ చిన్నారికి కాళ్ళు, చేతులు పట్టు ఇవ్వకపోవడంతో ఇబ్బందిపడింది. రేవతిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ పాప ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులను అడిగి పవన్ తెలుసుకున్నారు. రేవతిని బెంగళూరులోని నిమ్ హన్స్ ఆసుపత్రిలో చూపించామని, పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు వైద్యం ఉందనీ, ఖర్చు చాలా అవుతుందని వైద్యులు చెప్పారని పవన్ కు రేవతి తల్లిదండ్రులు చెప్పారు. ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయించాల్సి వస్తోందని, ఒకవేళ చేయించకపోతే కండరాలు బిగుసుకుపోయి చాలా బాధపడుతోందని ఆమె తల్లి చెప్పిన మాటలకు పవన్ కల్యాణ్ కళ్లు చెమర్చాయి.  ‘గబ్బర్ సింగ్’ అంటే ఇష్టమని చెప్పిన రేవతి

 పవన్ కల్యాణ్ ఒళ్లో కూర్చున్న చిన్నారి రేవతి ఎన్నో ముచ్చట్లు చెప్పింది. గబ్బర్ సింగ్ సినిమా అంటే తనకు ఇష్టమని చెప్పింది. ఆ సినిమాలోని పాటలు పాడి, డైలాగ్స్ చెప్పడంతో పవన్ ఎంతో ముచ్చట పడ్డారు. రేవతి పాడిన అన్నమయ్య కీర్తనలు విని ‘ఈ కీర్తనలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా?’ అని అడిగితే  ‘మా సంగీతం మిస్ నేర్పుతున్నారు’ అని చెప్పింది. మా పాప కల నెరవేరింది: తల్లి లక్ష్మీసుమ  

బ్యాటరీ వీల్ ఛైర్, మైసూరు వెళ్ళేందుకు ఆర్థిక సాయం ఇస్తామని  పవన్ కల్యాణ్  భరోసా ఇవ్వడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెప్పుకొంటున్నా. పవన్ ని చూడాలన్న మా పాప కల ఈరోజు నెరవేరింది. పాపను ఒడిలో కూర్చోపెట్టుకొని, కబుర్లు చెప్పి, ఆరోగ్య వివరాలను తెలుసుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.  పేద పురోహితుని కుటుంబానికి చెందిన రేవతి

 విజయవాడలో పౌరోహిత్యం చేసుకొంటూ చాలీచాలని సంపాదనతో సత్తిరాజు విజయకృష్ణ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆ పేద పురోహితుని చిన్న కుమార్తె రేవతి పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన మస్క్యులర్ డిస్ట్రఫీ అనే వ్యాధితో బాధపడుతోంది. కాళ్ళు, చేతులు బిగుసుకుపోవడం, మెడ నిలబెట్టలేకపోవడం లాంటి సమస్యలతో రేవతి ఇబ్బందిపడుతోంది. తగిన వైద్యం చేయించకపోతే ఒక్కో అవయవం క్షీణించిపోయే ప్రమాదం ఉంది.

ఖరీదైన వైద్యం చేయించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంవారు వైద్యం చేయిస్తామని చెప్పారు. చికిత్స పూర్తయ్యే వరకూ కుటుంబం మైసూరులోనే ఉండాలి. విజయవాడ నుంచి మైసూర్ వెళ్ళేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ని ఆ చిన్నారి తల్లిదండ్రులు లక్ష్మీసుమ, విజయకృష్ణ, అక్క జయలక్ష్మి కలిశారు.  

Pawan Kalyan
Visakhapatnam District
revathi
  • Loading...

More Telugu News