peddi bhotla: సుప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య కన్నుమూత!

  • కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పెద్దిభొట్ల
  • విజయవాడలో చికిత్స పొందుతూ మ‌ృతి
  • సాహితీ ప్రముఖుల సంతాపం

ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య (82) కన్నుమూశారు. కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. పెద్దిభొట్ల మృతిపై సాహితీ రంగానికి చెందిన వారితో, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. కాగా, పెద్దిభొట్ల గుంటూరులో జన్మించారు. పాఠశాల విద్యను ఒంగోలులో అభ్యసించారు. ఉన్నతవిద్యను విజయవాడలో కొనసాగించారు. విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో లెక్చరర్ గా నలభై ఏళ్లు అధ్యాపకుడిగా పని చేశారు. 1996లో పదవీ విరమణ చేశారు.

ఇక, ఆయన సాహిత్య ప్రస్థానం గురించి చెప్పాలంటే..  కాలేజీ విద్యనభ్యసించే రోజుల్లో ప్రముఖ రచయిత విశ్వనాథ సత్యనారాయణ వద్ద ఆయన శిష్యరికం చేశారు. పెద్దిభొట్ల రాసిన తొలికథ ‘చక్రనేమి’. ’పూర్ణాహుతి’, ’దుర్దినం’, ’శుక్రవారం’, ’ఏస్ రన్నర్’,  కథా సంకలనం  'వీళ్ళు' తదితర కథలు రాశారు. సుమారు  200కు పైగా కథలు రాశారు. ‘ముక్తి’, ‘చేదుమాత్ర’ వంటి నవలలు మొత్తం 8 రాశారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2012లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. రావిశాస్త్రి సాహిత్య స్మారకనిధి, గోపీచంద్ స్మారక అవార్డు, అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాలం ఫాండేషన్ వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులు, సన్మానాలు పెద్దిభొట్లకు లభించాయి.

 ఇదిలా ఉండగా, సాహిత్యరంగానికి ఎంతో సేవ చేసిన పెద్దిభొట్ల జీవించి ఉండగానే తన శరీరాన్ని మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి దానం చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. పెద్దిభొట్ల నాటి ప్రకటన మేరకు ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది స్వాధీనం చేసుకోనున్నారు.

  • Loading...

More Telugu News