karnataka: బలనిరూపణ సరే... ముందు స్పీకర్ సంగతేంటి?: యడ్యూరప్ప ముందు అతిపెద్ద సవాల్
- ఇప్పటికే ఆర్వీ దేశ్ పాండేను ప్రొటెం స్పీకర్ గా సిఫార్సు చేసిన అసెంబ్లీ
- అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ స్పీకర్ అభ్యర్థిని గెలిపించుకోలేకుంటే..?
- నంబర్ గేమ్ లో ఓడిపోతే..?
- యడ్యూరప్ప ముందున్న అతిపెద్ద సవాల్!
"శాశ్వత స్పీకర్ ను సభ ఎన్నుకోలేని పక్షంలో ప్రొటెం స్పీకర్ బలపరీక్షను నిర్వహించవచ్చు"... భారత రాజ్యాంగంలోని ఓ నిబంధన ఇది. ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓ స్పీకర్ ను ఎంపిక చేసుకోవడం బీజేపీకి తలకుమించిన పనే. శాశ్వత స్పీకర్ ను ఎన్నుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఉందనే భావించవచ్చు. గతంలోనూ విశ్వాస పరీక్షను ప్రొటెం స్పీకర్ నిర్వహించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.
ప్రస్తుతం కర్ణాటక ప్రొటెం స్పీకర్ గా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అత్యంత సీనియర్ ఆర్వీ దేశ్ పాండేని అసెంబ్లీ సచివాలయం సిఫార్సు చేసింది. ఆయనతో గవర్నర్ తొలుత ఎమ్మెల్యేగా, ఆపై ప్రొటెం స్పీకర్ గా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆపై ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అయితే సాధారణ స్పీకర్ మాదిరి ఈయనకు పూర్తి అధికారాలు ఉండవు. ఇదే సమయంలో ఓ పూర్తి స్థాయి స్పీకర్ ను ఎన్నుకునే ప్రక్రియ ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది.
ఇక అధికార పార్టీ తన సభ్యుడిని స్పీకర్ గా గెలిపించుకోలేకపోతే ప్రభుత్వానికి అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు లేదని తేలిపోతుంది. అది ఓ రకంగా విశ్వాసపరీక్షే. తన పార్టీ ఎమ్మెల్యేను స్పీకర్ గా గెలిపించుకోలేకపోతే ప్రభుత్వం పడిపోయినట్టే. సాధారణ మెజారిటీకన్నా 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్న బీజేపీ, తమ అభ్యర్థిని ఇప్పుడు ఎలా స్పీకర్ గా గెలిపించుకుంటుందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి 116 మంది ఎమ్మెల్యేల బలముంది. వీరు సంయుక్తంగా ఓ అభ్యర్థిని నిలిపితే యడ్యూరప్ప ముందు పెను సవాల్ ఉన్నట్టే.