Andhra Pradesh: మావోయిస్ట్ ఆర్కే బతికే ఉన్నాడా? చంద్రబాబును కోరిన హరగోపాల్, పొత్తూరి

  • నిన్న ఏఓబీ సరిహద్దుల్లో కూంబింగ్
  • ఆర్కే తప్పించుకున్నట్టు వార్తలు
  • పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం
  • చంద్రబాబు వద్ద పంచాయితీ

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో నిన్న గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ చేస్తున్న వేళ, మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే పోలీసులకు చిక్కాడన్న సమాచారం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. ఆర్కే తప్పించుకున్నాడన్న వార్తలు వచ్చినప్పటికీ, తాను క్షేమంగానే ఉన్నట్టు ఆర్కే నుంచి ఇంతవరకూ సమాచారం అందలేదు.

దీంతో విరసం సహా పౌరహక్కుల సంఘం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నాడా? లేక తప్పించుకున్నాడా? అసలు బతికే ఉన్నాడా? అంటూ ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన బతికే ఉంటే ఆ సమాచారాన్ని తక్షణం బయటకు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా, ఏఓబీ కటాఫ్ ఏరియాకు అటు ఒడిశా, ఇటు ఏపీ నుంచి భారీగా బలగాలను తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఆర్కే ఉన్నట్టు నమ్ముతున్న గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. ఇదేసమయంలో మల్కాన్ గిరి జిల్లా సెంబ్లీపాదర్ ప్రాంతంలో ఆర్కే ఆశ్రయం పొందుతున్నాడన్నాడని తెలుస్తుండగా, దీనిపై స్పష్టమైన సమాచారం లేదు.

ఆర్కే తప్పించుకున్నాడని తమకు అనుమానంగా ఉందని పోలీసులు చెబుతుండగా, ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నాడని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆర్కే గ్రేహౌండ్స్ అదుపులో ఉంటే ఆయన్ను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని, ఆయన ప్రాణాలకు ఎటువంటి హామీ తలపెట్టవద్దని చంద్రబాబును విరసం నేతలు కోరారు.

  • Loading...

More Telugu News