Japan: పనిభారం ఎక్కువైందంటూ ఆలయంపై రూ.52 లక్షలకు కేసేసిన బౌద్ధ సన్యాసి
- పని భారం కారణంగా ఒత్తిడికి లోనైన సన్యాసి
- విధులకు మించి పనిచేయించుకుంటున్నారని ఫిర్యాదు
- జపాన్‌లో ఘటన
తనపై విపరీతమైన పనిభారాన్ని మోపుతున్నారంటూ జపాన్‌లోని ఓ ఆలయంలో పనిచేస్తున్న బౌద్ధ సన్యాసి రూ.52 లక్షలకు (8.6 మిలియన్ యెన్‌లు) దావా వేశారు. దశాబ్ద కాలంగా ఆలయంలో పనిచేస్తున్న ఆయన పనిభారం కారణంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నానని కోర్టుకు తెలిపారు. పర్యాటకుల కోసం విరామం లేకుండా పనిచేస్తున్నానని, కాబట్టి తన ఆధ్యాత్మిక సేవలకు అందిస్తున్న వేతనంతోపాటు అధిక పనికి కూడా డబ్బులు ఇప్పించాలని కోర్టును వేడుకున్నారు.
జపాన్‌లోనే అత్యంత పవిత్రమైన మౌంట్ కోయా అనే వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో సన్యాసి గత పదేళ్లుగా ఆధ్యాత్మిక విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, కేసు వేసిన సన్యాసి పేరు, పనిచేస్తున్న ఆలయం వివరాలను చెప్పేందుకు అతడి తరపు లాయర్ నోరిటకే షిరాకురా నిరాకరించారు. 2015లో కోయాసన్ ప్రాంతంలో 1200వ వార్షికోత్సవం నిర్వహించారని, ఈ సందర్భంగా పర్యాటకులు పోటెత్తడంతో తన క్లైంట్‌తో 64 రోజులపాటు ఏకధాటిగా పనిచేయించుకున్నారని ఆయన తెలిపారు. కొన్నిసార్లు అయితే రోజుకు 17 గంటలు పనిచేయించారని పేర్కొన్నారు. కాబట్టి అధికంగా పనిచేయించుకున్నందుకు గాను తన క్లైంట్‌కు రూ.52 లక్షలు ఇప్పించాల్సిందిగా కోర్టును కోరారు.