Pawan Kalyan: ముక్కు పచ్చలారని చిన్నారులపై మానవ మృగాలు బరి తెగిస్తున్నాయి: పవన్‌ కల్యాణ్‌

  • ఆడ బిడ్డల్ని కాపాడటంలో పాలనా వ్యవస్థలు విఫలం
  • పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
  • ఆ చట్టం సక్రమంగా అమలు కావడం లేదు
  • బహిరంగంగా శిక్షించే విధానం తీసుకురావాలి

ఆడ పిల్లల్ని తప్పుగా చూస్తే ఉపేక్షించబోమంటూ ప్రభుత్వం చేసే హెచ్చరికలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాజాగా ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ... "గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఇటీవలే ఓ బాలికపై వృద్ధుడు చేసిన అత్యాచారం మరువక ముందే గుంటూరు నగరంలో రెండో తరగతి చదువుతున్న చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించడం దురదృష్టకరం.

ఆ వార్త మనసును కలచివేసింది. బాలికలు, యువతులపై ఇలాంటి అఘాయిత్యాలు చోటుచేసుకొంటుండటం పాలనా వ్యవస్థల వైఫల్యాన్ని తెలియచేస్తోంది. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ముక్కు పచ్చలారని చిన్నారులపై మానవ మృగాలు బరి తెగిస్తున్నాయి అంటే ఆ చట్టం సక్రమంగా అమలు కావడం లేదని అర్థం అవుతోంది.

ఈ చట్టంతోపాటు అత్యాచార నిరోధక చట్టంలో సవరణలు చేసి ఆడ పిల్లల జోలికి వెళితే బహిరంగంగా శిక్షించే విధానం తీసుకురావాలి. చట్టాల్ని కఠినతరం చేయడంతోపాటు మహిళల రక్షణ, వారిని గౌరవించడం అందరి బాధ్యత అనే విషయాలపై పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించాలి" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News