Pawan Kalyan: నా గుండె బరువెక్కింది.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బోటు ప్రమాదం: పవన్ కల్యాణ్‌

  • పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి
  • గిరిజనులకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి
  • నదుల్లో అనుమతులు లేని బోట్లు తిరగనివ్వద్దు
  • తగిన చర్యలు తీసుకోవాలి

గోదావరి నదిలో లాంచీ ప్రమాద ఘటన తెలియగానే తన గుండె బరువెక్కిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. రోజువారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జల సమాధి కావడం ఆందోళన కలిగించిందని ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. "60 అడుగుల లోతున లాంచీ పడిపోయిందని తెలిశాక ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. మృతుల కుటుంబాలకి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకి శాపం కావద్దు. ఈ ఘటనలో సర్కార్ శాఖలు, ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన లాంచీకి అనుమతులు సక్రమంగా లేవంటే... లోపం ఎవరిది? జవాబుదారీతనం లేని పాలన విధానాలే అమాయకుల్ని జలసమాధి చేశాయి. దుర్ఘటన జరగగానే హడావిడి చేసే పాలకులు.. సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపించాలి.

ప్రజల వద్దకు పాలన ప్రకటనలకే పరిమితమా? నిత్యావసరాలకి, వైద్యం, విద్య కోసం, ఏ చిన్న పని ఉన్నా నదిలోనే ప్రయాణాలు సాగిస్తూ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ శాఖలు గిరిజన గూడేలపై శ్రద్ధ చూపడం లేదు. పోలవరం నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరిగి వెళుతూ ఈ ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరం.

బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి గిరిజనులకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వారి గూడేలకి చేర్చాలి. నదుల్లో అనుమతులు లేని బోట్లు తిరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కృష్ణా నదిలో బోటు ప్రమాద ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం" అని పేర్కొన్నారు.

Pawan Kalyan
Jana Sena
boat
  • Loading...

More Telugu News