balu: తొలినాళ్లలో ఏసుదాసును చూసి భయపడేవాడిని: బాలసుబ్రహ్మణ్యం
- ఏసుదాసు గారిని గురువుగా భావిస్తుంటాను
- మొదట్లో ఆయనకి దూరం దూరంగా ఉండేవాడిని
- ఇద్దరం కలిసి ఒకే వేదికపై పాడేవాళ్లం
గానగంధర్వుడుగా ఏసుదాసుకు పేరుంటే .. మధురగాయకుడిగా బాలసుబ్రహ్మణ్యం పిలవబడుతున్నారు. కొన్ని సినిమాల కోసం ఇద్దరూ కలిసి పాడిన సందర్భాలు వున్నాయి. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఒక ప్రశ్నకి సమాధానంగా ఏసుదాసును గురించి ప్రస్తావించారు.
"ఏసుదాసు గారిని నేను గురువుగా భావిస్తాను .. తొలినాళ్లలో ఆయనని చూసి భయపడేవాడిని. మేధావి .. పెద్దవారు .. మలయాళ ప్రజలు ఆయనను ఒక దేవుడిలా భావిస్తుంటారు. అందువలన ఆయనతో కలిసి ఎలా పాడాలా? ఏంటా? అని దూరం దూరంగా ఉండేవాడిని .. ఇక ఆయన కూడా కొంచెం రిజర్వ్డ్ గానే ఉండేవారు. ఒక 20 సంవత్సరాల నుంచి బాగా దగ్గరయ్యే అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే, ఇద్దరం కలిసి కార్యక్రమాలు ఎక్కువ చేయడం మొదలెట్టాం. ఇద్దరం ఒకే వేదికపై కలిసి పాడేవాళ్లం .. ఎవరు ఎక్కువ అనే భావం మా ఇద్దరిలో ఎప్పుడూ రాలేదు" అని చెప్పుకొచ్చారు.