Madhya Pradesh: కొడుకు ఫెయిలైతే పాజిటివ్ గా ఆలోచించి.. పండగ సందడి చేసిన తండ్రి!

  • మధ్యప్రదేశ్ లో పదో తరగతి ఫెయిలైన విద్యార్థి
  • తన కొడుకుకు ఫ్లవర్ బొకే ఇచ్చి..వీధిలో ఊరేగించిన తండ్రి
  • ఫెయిలైతే అఘాయిత్యాలకు పాల్పడకూడదు
  • అందుకే, పాజిటివ్ గా ఆలోచించానంటున్న తండ్రి

యూనిట్ టెస్టుల్లో మార్కులు తక్కువస్తేనే తమ పిల్లలు చదువులో వెనకపడిపోయారని కొందరు తల్లిదండ్రులు భావిస్తున్న రోజులివి. మరి, పదో తరగతి, ఇంటర్మీడియట్..పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే సతాయించే తల్లిదండ్రులు, ఆ బాధలో అఘాయిత్యాలకు పాల్పడే విద్యార్థులు లేకపోలేదు!

అయితే, ఈ తల్లిదండ్రులు మాత్రం ఎంతో భిన్నం!
పదో తరగతి ఫెయిలైన తమ బిడ్డ ఆవేదన చెందకూడదని, ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడకూడదని భావించిన తండ్రి వినూత్న ఆలోచన చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. గత సోమవారం మధ్యప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యార్థి అన్షు తన ఫలితం చూసుకున్నాడు. నాలుగు సబ్జెక్ట్స్ లో ఫెయిలయ్యాడు. ఈ విషయాన్ని తన తండ్రి సురేంద్రకు చెప్పాడు.

వెంటనే, తన కొడుకుని ఎంతో ఆప్యాయంగా సురేంద్ర కౌగిలించుకున్నాడు. తమ బంధుమిత్రులకు ఫోన్లు చేసి తమ నివాసానికి రప్పించారు. ఇదంతా చూస్తున్న అన్షు కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అన్షు చేతికి ఫ్లవర్ బొకే ఇచ్చి, వీధిలో ఊరేగించేందుకు బయటకు తీసుకెళ్లారు. అన్షును మేళతాళాలతో ఊరేగిస్తూ, వీధిలో వారికి స్వీట్స్ పంచి పెడుతూ తండ్రి సురేంద్ర, బంధుమిత్రులు అతని వెంట నడిచారు.

ఫెయిలైన తనను ఊరేగించడంపై అన్షుతో పాటు స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. స్థానికుల ప్రశ్నలకు తండ్రి సురేంద్ర చెప్పిన సమాధానం విని ఆయన పాజిటివ్ థింకింగ్ కు ఆశ్చర్యపోయారు. ఇంతకీ, సురేంద్ర ఏం చెప్పాడంటే.. పరీక్షలో తప్పిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, జీవితంలో ఈ పరీక్ష ఫెయిలైనంత మాత్రాన ఆవేదన చెందాల్సిన అవసరం లేదని, ఇదే చివరి పరీక్షగా భావించవద్దనే విషయాన్ని తెలియజెప్పేందుకు ఈ ఆలోచన చేశానని చెప్పాడు.

ఈ ఊరేగింపు తర్వాత అన్షు తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. వాస్తవానికి తనకు చదువుపై ఆసక్తి లేదని, తన తండ్రి నిర్వహించే ట్రాన్స్ పోర్టు వ్యాపారాన్ని కొనసాగించాలని ఉందని చెప్పాడు.

  • Loading...

More Telugu News