tammareddy: దాసరి గారితో జరిగింది మామూలు గొడవ కాదు: తమ్మారెడ్డి భరద్వాజ
- దాసరి గారు నాకు చెప్పలేదని అసహనం కలిగింది
- నా మాటలు ఆయనకి కోపాన్ని తెప్పించాయి
- సన్నిహితుల ద్వారా మళ్లీ కలిసిపోయాము
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, దాసరి నారాయణరావుతో గొడవకి దారితీసిన పరిస్థితులను గురించి చెప్పుకొచ్చారు. "సాధారణంగా దాసరి నారాయణరావుగారు తన దగ్గరికి ఏ కథ వచ్చినా ముందుగా నాకు చెప్పేవారు .. సినిమా అయితే రష్ నాకు చూపించేవారు. అలాంటి ఆయన ఒకసారి నన్ను పిలిపించి "రేలంగి నరసింహారావును దర్శకుడిని చేయాలనుకుంటున్నాను .. కథ రెడీ చేయమన్నారు"
"కథ .. మాటలు రెడీ చేసి, రేలంగికి ఇచ్చాను. ఆయన బెంగుళూర్ వెళ్లి అక్కడున్న దాసరికి వినిపించారు .. ఆయన కథ విని నచ్చలేదన్నారు. ఆ తరువాత నేను దాసరి గారిని కలవడానికి వెళితే ఆయన షూటింగులో బిజీగా వున్నారు .. కలవడం కుదరలేదు. దాంతో నేను ఫీలై, అక్కడి నుంచి వచ్చేశాను. అయితే ఆ కథను అదే టైటిల్ తో వేరే దర్శకుడితో దాసరి గారు చేస్తున్నట్టుగా తర్వాత పేపర్లో ప్రకటన వచ్చింది.
దీంతో నీ సినిమాను వేరే వాళ్లు చేయడమేంటని కొంతమంది నన్ను రెచ్చగొట్టడంతో, వెంటనే నేను షూటింగును మొదలుపెట్టేశాను. ఆ సమయంలో ఓ ఇంటర్వ్యూలో దాసరి గారి పట్ల కాస్త ఆవేశంగా మాట్లాడాను. అది చూసి ఆయనకి కోపం వచ్చేసింది. ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. దాంతో అటు ఆయనకీ .. ఇటు నాకు సన్నిహితులుగా వున్నవాళ్లు నాకు నచ్చజెప్పి ఆ గొడవ సద్దుమణిగేలా చేశారు" అని అన్నారు.