Karnataka elections: మరోసారి ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి... సందేహాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్
- ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి వెళుతున్నాయి
- కర్ణాటకలో పరిస్థితి భిన్నంగా ఉంది
- బ్యాలట్ విధానంలో పోలింగ్ నిర్వహించడానికి ఉన్న సమస్యేంటి?
- కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ ప్రకాష్
కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అధికారానికి చేరువగా ఉన్నట్టు ఫలితాలు వస్తుండగా, కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని లేవనెత్తింది. ఆ పార్టీ సీనియర్ నేత మోహన్ ప్రకాష్ మాట్లాడుతూ... అన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎంల)పై సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పుడు పోల్స్ ను బ్యాలట్ విధానంలో నిర్వహించడానికి బీజేపీకి ఉన్న సమస్య ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.
‘‘మొదటి నుంచీ నేను చెబుతూనే ఉన్నా. దేశంలో ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తని రాజకీయ పార్టీయే లేదు. బీజేపీ కూడా గతంలో సందేహాలు వ్యక్తం చేసింది’’ అని మోహన్ ప్రకాష్ పేర్కొన్నారు. ప్రజలు ఒక పార్టీకి ఓటేస్తే, అవి మరో పార్టీకి వెళుతున్నాయని, ఎందుకంటే కర్ణాటకలో పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. మరోవైపు బీజేపీ మాత్రం ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాకు దక్కిన విజయంగా కర్ణాటక ఫలితాలను అభివర్ణించింది.
నిజానికి ఈవీఎంలను మోదీ సర్కారు ట్యాంపరింగ్ చేసి వరుసగా విజయాలు సాధిస్తోందని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. మిగిలిన రాజకీయ పార్టీల్లో కొన్ని కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. అయితే కేంద్రం, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలు, సందేహలను ఎన్నో సార్లు ఖండించింది. ట్యాంపరింగ్ కు అవకాశం లేదని ఈవీఎంలపై ఈసీ ప్రకటించగా, ట్యాంపర్ చేయవచ్చంటూ కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా కొందరు నిరూపించిన సందర్బాలు కూడా ఉన్నాయి. లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక అన్నట్టు ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారా, లేదా? అన్నది ఏదొో ఒక రోజు ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు చేరితే గానీ బయటపడదు.