BJP: ఫలితం మారుతుందా?... మెజారిటీకి దూరం జరుగుతున్న బీజేపీ!
- ఓ దశలో 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ
- ప్రస్తుతం 107 స్థానాలకు పరిమితం
- 73 స్థానాలకు పెరిగిన కాంగ్రెస్ ఆధిక్యం
ఇప్పటివరకూ అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన స్థానాలకన్నా ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొద్దిగా వెనక్కు తగ్గింది. 222 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 112 స్థానాల్లో గెలిస్తే అధికారం ఖాయమవుతుంది. ఓ దశలో 118 స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిన బీజేపీ, ఇప్పుడు 11 స్థానాల్లో ఆధిక్యాన్ని కోల్పోవడం గమనార్హం. ప్రస్తుతం బీజేపీ 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని 73 స్థానాలకు పెంచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. జేడీఎస్ 39 స్థానాల్లో ముందంజలో ఉంది.
ఇక ఇవే ఫలితాలు చివరి వరకూ కొనసాగితే, అధికారం పొందాలంటే కింగ్ మేకర్ గా మారిన జేడీఎస్ సహాయం తీసుకోవడం బీజేపీకి తప్పనిసరి. ఇదే సమయంలో గతంలో ఫిరాయింపుదారులను ప్రోత్సహించి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు లాక్కుని గోవా, మణిపూర్ లో అధికారానికి దగ్గరైనట్టే, కర్ణాటకలోనూ ఓ ఐదారుగురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.