Rahul Gandhi: ఇక మాకు రాహుల్ వద్దు... ప్రియాంక కావాలి: స్వరం మార్చిన కాంగ్రెస్ క్యాంప్
- కాళ్లకు బలపం కట్టుకుని తిరిగిన రాహుల్
- కాంగ్రెస్ ఓడిపోవడంతో నిరాశలో పార్టీ నేతలు
- ప్రియాంకకు ప్రాతినిధ్యం పెంచాలన్న డిమాండ్ తెరపైకి
కర్ణాటకలో ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాళ్లకు బలపం కట్టుకుని తిరిగి ప్రచారం చేసినా, కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలోకి మునిగిపోవడంతో పాటు స్వరం మార్చారు. చేతిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద రాష్ట్రంలో అధికారం కోల్పోవడాన్ని తట్టుకోలేకున్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ దూకుడును అడ్డుకోవడం రాహుల్ గాంధీకి సాధ్యం కాదని, ఇక వెంటనే ప్రియాంకా గాంధీని రంగంలోకి దించాలని డిమాండ్ ప్రారంభించారు. పార్టీలో ప్రియాంక ప్రాతినిధ్యం పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియాలో తమ చేతుల్లోకి వచ్చిన 22వ రాష్ట్రంగా కర్ణాటక మారిన వేళ, బీజేపీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిలపాలంటే ప్రియాంకా గాంధీ అవసరం ఎంతైనా ఉందని కొందరు నేతలు చాలాకాలంగా అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన గుజరాత్, కర్ణాటక సహా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు విజయం దూరమైన నేపథ్యంలో, ఆయన నాయకత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రియాంకను వెంటనే తీసుకురావాలన్న డిమాండ్ ను మరోసారి తెరపైకి తెచ్చారు.