Telugu Voters: ప్రభావం చూపని ప్రత్యేక హోదా... కన్నడనాట బీజేపీకి మద్దతిచ్చిన తెలుగువారు!
- హైదరాబాద్ కర్ణాటకలో 40 అసెంబ్లీ స్థానాలు
- 25 చోట్ల బీజేపీ అభ్యర్థుల ఆధిక్యం
- స్థానికాంశాలకే ప్రాధాన్యమిచ్చిన తెలుగు ఓటర్లు
ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు ఆదరించరని వచ్చిన విశ్లేషణలు తప్పని తేలాయి. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న హైదరాబాద్ కర్ణాటకలో 40 అసెంబ్లీ స్థానాలుండగా, 25 స్థానాల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసే దిశగా దూసుకెళుతోంది. ఈ ఎన్నికల్లో స్థానికాంశాలే తప్ప, పక్క రాష్ట్రాల అంశాలు ప్రభావం చూపలేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి.
ప్రత్యేక హోదాతో కర్ణాటకలో ఉన్న తమకు ఎటువంటి ఉపయోగం ఉండదని భావించిన అక్కడి తెలుగువారు, సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఉన్న తమ వ్యతిరేకతను మాత్రమే చూపించారని భావించవచ్చు. ఇక మహారాష్ట్రను ఆనుకుని ఉన్న ముంబై కర్ణాటక రీజియన్ లోనూ బీజేపీ మంచి ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక్కడ 50 నియోజకవర్గాలుండగా, 30 చోట్ల బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక కోస్తా కర్ణాటక విషయానికి వస్తే బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసినట్టే. ఇక్కడ 19 నియోజకవర్గాలుండగా, 16 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ మూడు రీజియన్లలో రెండు రీజియన్లలో తెలుగు ఓటర్లు అధికంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. వారి మద్దతుతోనే ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థులు గెలుపుబాటలో నడుస్తున్నారన్నది సుస్పష్టం.