Karnataka: రికార్డు సృష్టించిన కర్ణాటక ఎన్నికలు.. ఎందులోనంటే..?
- దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా రికార్డు
- రూ.10 వేల కోట్లు దాటిన ఖర్చు
- రూ.60 వేల కోట్లకు చేరనున్న 2019 లోక్‌సభ ఎన్నికల ఖర్చు
ఈ నెల 12న ముగిసిన కర్ణాటక ఎన్నికలు దేశంలోనే రికార్డు సృష్టించాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా రికార్డులకెక్కాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డబ్బును ధారాళంగా ఖర్చు పెట్టాయి. ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ (సీఎంఎస్) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది.
సీఎంఎస్ నివేదిక ప్రకారం.. కర్ణాటక ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ పార్టీలు రూ. 9,500 నుంచి రూ.10,500 కోట్లు ఖర్చు చేశాయి. 2013 ఎన్నికల్లో ఆయా పార్టీలు ఖర్చు చేసిన దానికి ఇది సరిగ్గా రెట్టింపు. ప్రధానమంత్రి ప్రచారానికి అయిన ఖర్చు ఇందుకు అదనం. ఈ లెక్కన చూసుకుంటే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు చేరుకుంటుందని సీఎంఎస్ అంచనా వేసింది. 2014లో ఈ ఖర్చు రూ.30 వేల కోట్లు మాత్రమేనని సీఎంఎస్‌కు చెందిన ఎన్.భాస్కరరావు తెలిపారు.